Sajjanar: ఆర్టీసీ ఉద్యోగుల కష్టాలపై పాట రాస్తానన్నారు.. అంతలోనే..: గద్దర్‌పై సజ్జనార్‌ ట్వీట్

ఆర్టీసీ ఉద్యోగుల కష్టాలపై ఓ పాట రాసి సంస్థకు అంకితం చేస్తానని ప్రజాగాయకుడు గద్దర్‌ చెప్పారని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ గుర్తు చేసుకున్నారు.

Published : 07 Aug 2023 14:52 IST

హైదరాబాద్‌: ఆర్టీసీ ఉద్యోగుల కష్టాలపై ఓ పాట రాసి సంస్థకు అంకితం చేస్తానని ప్రజాగాయకుడు గద్దర్‌ చెప్పారని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ గుర్తు చేసుకున్నారు. ఎల్బీ స్టేడియంలో గద్దర్‌ పార్థివదేహానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం ట్వీట్‌ చేసిన సజ్జనార్‌.. గద్దర్‌తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఉద్యోగుల కష్టాలపై పాట రాస్తానని చెప్పారని.. అంతలోనే ఆయన మరణవార్త వినడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సజ్జనార్‌ పేర్కొన్నారు.

‘‘నెల రోజుల క్రితం నన్ను గద్దర్‌ కలిశారు. అప్పుడు ప్రజారవాణా వ్యవస్థ ప్రాముఖ్యతతో పాటు బస్‌తో తనకున్న అనుబంధాన్ని ఆయన వివరించారు. ఒక లెజండరీ కవి, యాక్టివిస్ట్‌ను కోల్పోయాం. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన పాటలతో ప్రజలను చైతన్యం కలిగించి.. ప్రజా యుద్ధనౌకగా ప్రజల హృదయాల్లో గద్దర్‌ నిలిచిపోయారు. ఆయనతో నాకు దశాబ్దకాలంగా పరిచయం ఉంది. అనేకసార్లు వ్యక్తిగతంగా నన్ను కలిశారు. ఎన్నో విషయాలు పంచుకున్నారు. తాను చెప్పాల్సిన విషయాన్ని ఎంతో ధైర్యంగా.. మృదువుగా చెప్పేవారు.

ఉద్యమం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపే పోరాటం కాదని.. ప్రజల హక్కులను కాపాడుకోవడమని చెప్పేవారు. పాటను గద్దర్‌ వ్యాపారంగా చూడలేదు. పాట ద్వారా ప్రజా సమస్యలను బయటకు తెచ్చారు. ప్రజాస్వామ్యం ద్వారానే హక్కులను సాధించుకోవడం సాధ్యమని ఆయన భావించారు. తాను మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకుని ఎందరికో ఆదర్శప్రాయుడయ్యారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’అని సజ్జనార్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని