Turkey Earthquake: ఆ రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపాం: తుర్కియేలోని సిక్కోలు వాసులు

తుర్కియే (Turkey)లో ఉపాధి కోసం వెళ్లిన శ్రీకాకుళం జిల్లా వాసులు భూకంపం(Earthquake)తో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కంటైనర్లలో ఉండటంతో తాము సురక్షితంగా బయటపడ్డామని చెప్పారు.

Updated : 07 Feb 2023 15:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గాఢ నిద్రలో ఊహించని విపత్తు.. కళ్లు తెరిచేలోగా అల్లకల్లోలం.. కళ్లముందే పేకమేడలా కూలిన భవనాలు.. శిథిలాల కింద ఛిద్రమైన వేల జీవితాలు.. ప్రకృతి ప్రకోపానికి అతలాకుతలమైన తుర్కియే (Turkey)లో ఇప్పుడు ఎటు చూసినా కన్పిస్తున్న హృదయ విదారక దృశ్యాలివి..! భూకంపం (earthquake) సృష్టించిన విలయానికి ఎన్నో కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. సర్వం కోల్పోయి వారంతా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరోవైపు ఉపాధి నిమిత్తం భారత్‌ నుంచి ఎంతోమంది తుర్కియేకు వెళ్లగా.. ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉందోనని స్వదేశంలో ఉన్న కుటుంబీకులు భయపడుతున్నారు. వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. అయితే ఈ విపత్తు నుంచి వారు సురక్షితంగా బయటపడ్డారని తెలుసుకుని వారంతా ఊపిరి పీల్చుకున్నారు. 

తుర్కియేలోని అదానా నగరానికి సమీపంలో ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువకులు వివిధ నిర్మాణ, ఇతర రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. భారీ భూకంపం సంభవించడంతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తుర్కియేలో ఉన్న కవిటి, సోంపేట, కంచిలి ప్రాంత యువకులతో ‘ఈనాడు.నెట్‌’ మాట్లాడింది. ప్రకంపనలు వచ్చిన సమయంలో వారి పరిస్థితేంటి?అనేది తెలుసుకునే ప్రయత్నం చేసింది. కంటైనర్లలో ఏర్పాటు చేసిన బసలో తామంతా ఉండటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని వారు తెలిపారు. కానీ ఆ రాత్రంగా బిక్కుబిక్కుమంటూ గడిపామని తెలిపారు.


ఏం జరిగిందో తొలుత అర్థం కాలేదు

‘‘మేం తుర్కియేలోని అదానా నగరానికి సమీపంలో ఉన్నాం. మా ప్రాంతం సిరియా సరిహద్దుకు సుమారు 300 కి.మీ దూరంలో ఉంటుంది. ఓ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నాం. సోమవారం వేకువజామున 4.15 గంటల సమయంలో భూ ప్రకంపనలు వచ్చాయి. మేం కంటైనర్లలో నిద్రపోతున్నాం. భూకంపం వచ్చిన సమయంలో మా బెడ్స్‌ అన్నీ కదిలాయి. దీంతో మేం నిద్ర లేచి గట్టిగా కేకలు పెట్టాం. వెంటనే మిగతా అందర్నీ నిద్రలేపి కంటైనర్‌ నుంచి బయటకు పరుగులు తీశాం. ఏం జరిగిందనేది తొలుత మాకూ అర్థం కాలేదు. ఆ తర్వాత అది భూకంపం అని తెలిసింది. ఆ తర్వాత పలుమార్లు మళ్లీ భూమి కంపించింది. ఆ రోజంతా చాలా ఆందోళన చెందాం. స్వదేశంలో మా కుటుంబీకులు మా క్షేమ సమాచారాలపై తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వీడియో కాల్స్‌ చేసి క్షేమంగా ఉన్నామని చెప్పాకే వారు కాస్త కుదుటపడ్డారు. మేం పనిచేస్తున్న సంస్థ మాకు ఏ ఇబ్బందీ కలగకుండా చూసుకుంటోంది. సమయానికి భోజనం అందిస్తోంది. భూకంపం నేపథ్యంలో విధులకు రావొద్దని.. పరిస్థితులన్నీ చక్కబడ్డాకే మళ్లీ పిలుస్తామని తెలిపింది’’

- గురుదేవ్‌, కవిటి, శ్రీకాకుళం జిల్లా


నిమిషం పాటు మా కంటైనర్‌ షేక్‌ అయింది

‘‘సోమవారం వేకువజామున 4 గంటల తర్వాత భూకంపం వచ్చింది. మేం కంటైనర్లో నిద్రపోతున్నాం. అందులో ఉండటంతోనే సురక్షితంగా బయటపడ్డాం. భూ ప్రకంపనలు వచ్చిన సమయంలో కంటైనర్‌ షేక్‌ అయింది.. సుమారు నిమిషం పాటు అది కదిలింది. ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురై మా కంటైనర్లో ఉన్న వాళ్లందరినీ నిద్రలేపి బయటకు వచ్చేశాం. ఆ సమయంలో ఏం జరుగుతుందో తెలియక మా కాళ్లూ చేతులు వణికిపోయాయి’’
- రత్నాల కామరాజు, గొల్లూరు, సోంపేట

ఆ రాత్రంతా నిద్రపట్టలేదు


‘‘మేం రెండు నెలల క్రితం ఉపాధి కోసం ఇండియా నుంచి తుర్కియే వచ్చాం. భూకంపం వచ్చినప్పుడు తొలుత మాకేం అర్థంకాలేదు. కంటైనర్‌ నుంచి అందరం బయటకు వచ్చిన తర్వాత విషయం మాకు అర్థమైంది. మళ్లీ భూకంపం వస్తుందనే వార్తలతో సోమవారం రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపాం.. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని అస్సలు నిద్ర పట్టలేదు. కానీ దేవుడి దయవల్ల మాకు ఎలాంటి ఇబ్బందీ కలగలేదు’’
- నెయ్యిల గణేశ్‌, ఎక్కలూరు, కంచిలి
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని