సామాన్యుల దీపావళి మీ చేతుల్లోనే: సుప్రీం

కరోనా సంక్షోభంలో రుణగ్రహీతలకు ఇచ్చిన మారటోరియం కాలంలో విధించిన చక్రవడ్డీ మాఫీ విషయంపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీ మాఫీ అమలు ఏమైందని జస్టిస్‌...

Updated : 14 Oct 2020 22:20 IST

దిల్లీ: కరోనా సంక్షోభంలో రుణగ్రహీతలకు ఇచ్చిన మారటోరియం కాలంలో విధించిన చక్రవడ్డీ మాఫీ విషయంపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీ మాఫీ అమలు ఏమైందని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. చక్రవడ్డీ మాఫీపై నిర్ణయం తీసుకున్నామని.. అయితే ఇంకా అమలు చేయలేదని సోలిసిటరీ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు తెలిపారు. మరోవైపు రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీ మాఫీ చేస్తామని బ్యాంకుల తరఫు న్యాయవాది హరీష్‌ సాల్వే కూడా కోర్టుకు తెలిపారు.

చక్రవడ్డీ మాఫీ చేస్తామని నిర్ణయం తీసుకున్న తర్వాత అమలు చేయడంలో ఎందుకు జాప్యం జరుగుతోందని ఈ సందర్భంగా కేంద్రాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. రుణాలు ఇవ్వడంలో వైవిధ్యమైన పద్ధతులుంటాయని, అందుకే బ్యాంకులతో సంప్రదింపులు జరిపినట్లు మెహతా కోర్టుకు సమాధానమిచ్చారు. కేంద్రం ఇచ్చిన సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం.. చక్రవడ్డీ మాఫీ విషయంలో కేంద్ర నిర్ణయంపై సామాన్య ప్రజల్లో ఇంకా ఆందోళన ఉందని చెప్పింది. సామాన్యులకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని.. అయితే ఈ నిర్ణయాన్ని కేంద్రం త్వరగా అమలు చేయాలని కోరుకుంటున్నట్లు జస్టిస్‌ ఎం.ఆర్‌ షా తెలిపారు. ‘సామాన్యుల దీపావళి మీ చేతుల్లోనే ఉంది’ అని కేంద్రాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. తదుపరి విచారణ సమయానికి చక్రవడ్డీ మాఫీ అమల్లోకి వస్తుందని సుప్రీం ధర్మాసనం ఆశాభావం వ్యక్తం చేస్తూ.. తదుపరి విచారణను నవంబర్‌ 2కి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని