CBN: మ‌హానాడు పండుగ రోజు: చంద్ర‌బాబు

క‌రోనా నేప‌థ్యంలో వ‌రుస‌గా రెండో ఏడాది కూడా వ‌ర్చువ‌ల్ విధానంలో నిర్వ‌హిస్తున్న తెలుగుదేశం మ‌హానాడు కార్య‌క్ర‌మం తొలిరోజు కొన‌సాగుతోంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు.. పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ చిత్ర‌ప‌టానికి నివాళులు అర్పించి

Updated : 27 May 2021 13:14 IST

అమ‌రావ‌తి: క‌రోనా నేప‌థ్యంలో వ‌రుస‌గా రెండో ఏడాది కూడా వ‌ర్చువ‌ల్ విధానంలో నిర్వ‌హిస్తున్న తెలుగుదేశం మ‌హానాడు కార్య‌క్ర‌మం తొలిరోజు కొన‌సాగుతోంది. తెదేపా వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ చిత్ర‌ప‌టం వద్ద ఆ పార్టీ అధినేత చంద్రబాబు నివాళులు అర్పించి మ‌హానాడును ప్రారంభించారు. కార్య‌క్ర‌మంలో భాగంగా తొలుత క‌రోనా బారిన ప‌డి ప్రాణాలు కోల్పోయిన నేత‌లు, కార్య‌క‌ర్త‌లకు నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మృతుల కుటుంబాల‌కు పార్టీ అండ‌గా ఉంటుంద‌న్నారు. ఊహించ‌ని మ‌హానాడు ఇది అని.. క్రియాశీల నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను కోల్పోవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. తెలుగు జాతి అంటే ఎన్టీఆర్ గుర్తొస్తార‌ని చెప్పారు. తెలుగువారి ఆత్మ‌గౌరవం నినాదంతో ఆయ‌న పార్టీని స్థాపించార‌ని చెప్పారు. ఆత్మ‌గౌర‌వంతో పాటు ఆత్మ‌విశ్వాసంతో ముందుకు పోవాల‌ని తాను సంకల్పించిన‌ట్లు చంద్ర‌బాబు వివ‌రించారు. తెలుగు జాతికి మ‌హానాడు పండుగ రోజు అన్నారు. తెదేపా ఏ మతానికో పరిమిత‌మైంద‌ని కాద‌ని స్ప‌ష్టం చేశారు. 

ప్ర‌భుత్వం భ‌రోసా ఇవ్వ‌లేక‌పోతోంది..

క‌రోనా విప‌త్కాలంలో ప్ర‌భుత్వం స‌రైన రీతిలో స్పందించ‌లేద‌ని చంద్ర‌బాబు ఆరోపించారు. ఆక్సిజ‌న్ లేక‌, కొవిడ్ మందుల‌ను బ్లాక్‌లో కొన‌లేక ప్ర‌జ‌లు ఆర్థికంగా చితికిపోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. '' సంక్షోభ నివార‌ణ‌కు క‌లిసి ప‌ని చేద్దామ‌ని ప్రభుత్వానికి స‌ల‌హాలు, సూచ‌న‌లిస్తున్నా బాధ్య‌త లేకుండా వ్య‌వ‌హ‌రించారు. స‌ల‌హాల‌ను ఎగ‌తాళి చేసి పారాసిటమాల్‌, బ్లీచింగ్ పౌడ‌ర్‌తో పోతుంద‌ని మాట్లాడారు. ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇచ్చే ప‌రిస్థితుల్లో కూడా ప్ర‌భుత్వం లేదు. తిరుప‌తి రుయాలో చ‌నిపోయిన వారి సంఖ్య‌పై అవాస్త‌వాలు చెప్పారు. మాన‌వ‌హ‌క్కుల సంఘం విచార‌ణ చేప‌డితే లెక్క మార్చారు'' అని చంద్ర‌బాబు అన్నారు.

ఆనంద‌య్య మందుపై నిర్ల‌క్ష్యం..

ఆనంద‌య్య మందుపై నిర్ణ‌యం తీసుకోకుండా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌భుత్వ త‌ప్పుల‌ను ఎత్తిచూపితే అక్ర‌మ కేసులు పెట్టి అరెస్టు  చేస్తారా?  మాట్లాడే వారి నోరు మూసేయాలంటూ స్టేట్ టెర్ర‌రిజానికి పాల్ప‌డుతున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వ వేధింపుల వ‌ల్ల డాక్టర్ సుధాక‌ర్‌, కోడెల స‌హా ఎంతో మంది చ‌నిపోయారు. సామాజిక మాధ్య‌మాల్లో పోస్టులు పెట్టిన వారిని వెంటాడుతున్నారు. కోర్టుల‌ను కూడా మంత్రులు బెదిరించే ప‌రిస్థితికి వ‌స్తే ప్ర‌జాస్వామ్యం ఎటు పోతుందో అర్థం చేసుకోవాలి. అచ్చెన్నాయుడితో మొద‌లు పెట్టిన అక్ర‌మ కేసులు జనార్ద‌న్‌రెడ్డి వ‌ర‌కు కొన‌సాగించారు. ఎంపీ ర‌ఘురామ‌పై త‌ప్పుడు కేసులు పెట్టి పోలీసు క‌స్ట‌డీలో హింసించారు. స్థానికంగా అంతా మేనేజ్ చేసి సుప్రీంకోర్టులో దొరికిపోయారు. బెయిల్ రాకుండా కేసులు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు అని అన్నారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని