Tamilisai Soundararajan: డియర్‌ సీఎస్‌.. దిల్లీ కన్నా రాజ్‌భవన్‌ దగ్గర!: తమిళిసై

తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన పది బిల్లులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పెండింగ్‌లో పెట్టడాన్ని సవాల్‌చేస్తూ రాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టులో గురువారం రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై తాజాగా గవర్నర్‌ తమిళిసై స్పందించారు.

Updated : 03 Mar 2023 12:50 IST

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన పది బిల్లులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పెండింగ్‌లో పెట్టడాన్ని సవాల్‌చేస్తూ రాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టులో గురువారం రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వాటికి తక్షణమే ఆమోదముద్ర వేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్‌లో కోరింది. బిల్లుల ఆమోదంపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్‌ వేయడంపై స్పందించిన గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) శాంతికుమారిని ఉద్దేశించి ట్వీట్ చేశారు.

‘‘రాజ్‌భవన్‌ దిల్లీ కంటే దగ్గరగా ఉంటుంది. సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్నాక రాజ్‌భవన్‌కు రావడానికి శాంతికుమారికి సమయం లేదా? అధికారికంగా రాలేదు, ప్రొటోకాల్‌ లేదు. కనీసం మర్యాదపూర్వకంగా కూడా సీఎస్‌ నన్ను కలవలేదు. స్నేహపూర్వక వాతావరణంలో అధికారిక పర్యటనలు ఉపయోగపడతాయి’’ అని తమిళిసై ట్వీట్‌ చేశారు.

2022 సెప్టెంబరు 14 నుంచి 2023 ఫిబ్రవరి 13 మధ్యకాలంలో 10 బిల్లులను పంపినా ఇంతవరకు గవర్నర్‌ ఆమోదముద్ర వేయలేదని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ చర్యను నిష్క్రియాత్మకత, విస్మరణ, రాజ్యాంగ విధినిర్వహణలో విఫలమైనట్లుగా పరిగణించాలని కోరింది. బిల్లులకు ఆమోదం తెలపకపోవడం తీవ్రమైన చట్టవ్యతిరేక చర్యగా గుర్తించాలని విజ్ఞప్తిచేసింది. ఇకమీదటైనా ఈ బిల్లులకు ఆమోదం తెలిపేలా ఉత్తర్వులు జారీచేయాలని కోరింది. పెండింగ్‌ బిల్లుల గురించి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, సీనియర్‌ అధికారులు గవర్నర్‌ను కలిసి.. అనుమానాలకు మౌఖికంగా సమాధానం ఇచ్చిన అనంతరం వాటిని క్లియర్‌ చేస్తామని చెప్పికూడా చేయలేదని కోర్టు దృష్టికి తెచ్చింది. 2023-24 బడ్జెట్‌కు ముందస్తు అనుమతివ్వకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం విధిలేని పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చినట్లు తెలిపింది. అదే సమయంలో పెండింగ్‌ బిల్లుల గురించి కోర్టు దృష్టికి తెచ్చినప్పుడు.. త్వరలో ఆ సమస్యను పరిష్కరిస్తామని గవర్నర్‌ తరఫున హాజరైన న్యాయవాది హామీ ఇచ్చినా ఇప్పటివరకూ నెరవేర్చలేదని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన సీఎస్‌ ఎ.శాంతికుమారి దాఖలుచేసిన ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా గవర్నర్‌ కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వాలను చేర్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని