Justice NV ramana: తెలంగాణలో 11ఏళ్లు పని చేశా.. హైకోర్టు ఎంతో నేర్పింది: జస్టిస్‌ ఎన్‌వీ రమణ

దిల్లీకి రాజైనా తల్లికి బిడ్డేనని.. తెలంగాణ హైకోర్టుకు వస్తే తల్లి ఒడిలో ఉన్నట్లు ఉంటుందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ అన్నారు. తెలంగాణ హైకోర్టులో తిరుగుతుంటే భావోద్వేగానికి లోనవుతున్నట్లు చెప్పారు. ఎక్కడ ఉన్నా.. ఏ స్థానంలో ఉన్నా.. తాను ఎప్పుడూ...

Updated : 15 Apr 2022 21:26 IST

హైదరాబాద్‌: దిల్లీకి రాజైనా తల్లికి బిడ్డేనని.. తెలంగాణ హైకోర్టుకు వస్తే తల్లి ఒడిలో ఉన్నట్లు ఉంటుందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ అన్నారు. తెలంగాణ హైకోర్టులో తిరుగుతుంటే భావోద్వేగానికి లోనవుతున్నట్లు చెప్పారు. ఎక్కడ ఉన్నా.. ఏ స్థానంలో ఉన్నా.. తాను ఎప్పుడూ తెలంగాణ బార్ అసోసియేషన్ సభ్యుడినేనని తెలిపారు. తెలంగాణ న్యాయవాదులు, బార్ కౌన్సిల్ సభ్యులు తనకి సన్మానం చేయడం చాలా అనందంగా ఉందని పేర్కొన్నారు. తనను ఇంతగా ఆదరిస్తున్న తెలంగాణ ప్రజలకు శతకోటి వందనాలు తెలిపారు. 11 సంవత్సరాలు ఇక్కడే పని చేశానని.. హైకోర్టు తనకు చాలా నేర్పిందని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ సాధన కోసం న్యాయవాదులు, అడ్వొకేట్లు చాలా శ్రమించారని వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధి చెందుతుందంటే సంతోషించే వారిలో తాను ఒకరని చెప్పారు. కేసులు లేనప్పుడు ఖాళీగా కూర్చున్న రోజులు, అప్పట్లో సిద్ధయ్య క్యాంటీన్‌లో టీ తాగిన రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్‌ ఎన్‌వీ రమణ మాట్లాడుతూ.. ‘‘సామాన్యుడికి న్యాయం అందించాలంటే రెండు విషయాలు చాలా కీలకం. కోర్టులు అందుబాటులో ఉండాలి.. వాటిలో మౌలిక సదుపాయాలు ఉండాలి. ఇందుకు జ్యుడిషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాం. కేంద్ర ప్రభుత్వం ఆమోదం రావాల్సి ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1100 మంది హైకోర్టు న్యాయమూర్తులు ఉన్నారు. 400 ఖాళీలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. మే నెలాఖరు వరకు మరో 200 మంది జడ్జిల నియామకం పూర్తి అవుతుంది. తెలంగాణలో 24 ఉంటే 42 చేశాం. ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కొలీజియం సభ్యులు పేర్లు సూచిస్తే వాటిని భర్తీ చేస్తాం. తెలంగాణలో అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సబార్డినేట్ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. కొన్ని కోర్టులకు కొత్త భవనాలు నిర్మిస్తున్నామన్నారు. ఇంత సహకారం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యావాదాలు.

నా మొదటి ఆలోచన హైదరాబాద్ మీదనే..

ప్రస్తుతం న్యాయవాదుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. న్యాయవాద వృత్తినే మానేసే స్థితికి వచ్చారు. కొవిడ్ వల్ల వారు ఎంతో నష్టపోయారు. వారిని ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరాను. సీనియర్ న్యాయవాదులు వారిని పెద్ద మనసుతో ఆదుకోండి. న్యాయవాదుల శిక్షణ కోసం అకాడమీ అవసరం ఉంది. కొత్తగా వృత్తిలోకి వచ్చిన న్యాయవాదులకు వసతి సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. ఇందు కోసం నేను శ్రమిస్తాను. నా మొదటి ఆలోచన హైదరాబాద్ మీదనే ఉంటుంది. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ అందరికీ ఉపయోగపడుతుంది. ఆల్ ఇండియూ జ్యుడిషియల్ డేటా మేనేజ్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని భావించాం. నాగ్‌పూర్ లేదా మరో ప్రాతం సూచించారు. కానీ నేను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని సూచించాను. అది ఏర్పాటైతే నగరానికి జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు వస్తుంది. నేషనల్ అప్పిలేట్ ట్రైబ్యునల్ బెంచ్ ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కోరాను. అందుకు ప్రతిపాదనలు పంపితే మన ప్రాంతానికి చెందిన కంపెనీలు వృద్ధి చెందుతాయి. సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి. చిన్ని చిన్న విషయాలకు ఫిర్యాదుల చేసుకోకండి’’ అని జస్టిస్‌ ఎన్‌వీ రమణ సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని