Konijeti Rosaiah: రోశయ్య భౌతికకాయానికి సీఎం కేసీఆర్‌ నివాళి

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోశయ్య పార్థివదేహానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ నివాళులు అర్పించారు.

Updated : 04 Dec 2021 15:12 IST

హైదరాబాద్‌: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోశయ్య పార్థివదేహానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ నివాళులు అర్పించారు. నగరంలోని అమీర్‌పేటలో ఉన్న రోశయ్య నివాసానికి వెళ్లిన కేసీఆర్‌.. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేసీఆర్‌తో పాటు పలువురు నాయకులు రోశయ్య భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

రోశయ్య భౌతికకాయానికి సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ నివాళులర్పించారు. ‘రోశయ్య మరణం తెలుగు ప్రజలకు తీరని ఆవేదన కలిగిస్తోంది. కార్యకర్త స్థాయి నుంచి సీఎం, గవర్నర్‌ స్థాయి వరకూ ఆయన చేరారు. రోశయ్య తెలుగువారందరికీ గుర్తింపు తెచ్చారు. అర్ధ శతాబ్దానికిపైగా ప్రజలకు సేవలు అందించారు. ప్రజాసమస్యలు పరిష్కరిస్తూ పాలనాదక్షుడిగా పేరుపొందారు. ఆయన మృతి తెలుగు ప్రజలకు తీరని లోటు. విలువలకు, సంప్రదాయాలకు రోశయ్య మారుపేరు’ అని జస్టిస్‌ ఎన్వీ రమణ పేర్కొన్నారు.

‘‘రోశయ్య హఠాన్మరణం చాలా బాధాకరం. ఆయనతో నాకు చాలా దగ్గరి అనుబంధం ఉండేది. అందరి సీఎంల చేత రోశయ్య మెప్పు పొందారు. ప్రతిపక్షాలను సైతం ఒప్పించి, మెప్పించగల నేర్పరి రోశయ్య. సీఎంగా, గవర్నర్‌గా అనేక పదవులకు ఆయన వన్నె తెచ్చారు’’- మంత్రి హరీశ్‌రావు 

‘‘రాజకీయాల్లో రోశయ్య నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఆయన హఠాన్మరణం చాలా బాధకరం. రోశయ్యను ఆదర్శంగా తీసుకొని నేటి రాజకీయ నాయకులు పని చేయాల్సిన అవసరం ఉంది’’ - మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

‘‘రోశయ్య గొప్ప రాజకీయ వేత్త, నిరాడంబరుడు, మృదుస్వభావి, సౌమ్యశీలుడు. దేశ వ్యాప్తంగా ఓ రాష్ట్రంలో ఏకంగా 15సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. అలాంటి రాజకీయ నాయకుడి నుంచి చాలా నేర్చుకోవాలి’’- మంత్రి శ్రీనివాస్‌గౌడ్

 

‘‘రాజకీయాల్లో సుదీర్ఘమైన అనుభవం ఉన్న, అత్యంత క్రమశిక్షణ గల కార్యకర్త రోశయ్య. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ఆయన అత్యంత క్రీయాశీలక పాత్ర పోషించారు. రోశయ్య మరణం తెలుగు రాజకీయాల్లో తీరని లోటు. తెలుగువాళ్లు ఎక్కడున్నా రోశయ్యకు నివాళులు అర్పించాలి. నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఆయన ప్రసంగాలు చూశాను. సభలో రోశయ్య ప్రశ్నలకు ముఖ్యమంత్రులు జాగ్రత్తగా సమాధానాలు ఇచ్చేవారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష సమయంలో సోనియాకు సమస్యలన్నీ విన్నవించారు. తెలంగాణ సమస్యలను రోశయ్య కేంద్రం దృష్టికి నిజాయతీగా తీసుకెళ్లారు’’ - టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

‘‘సుదీర్ఘకాలం రాజకీయాల్లో గడిపిన మహనీయుడు రోశయ్య. సమైఖ్య రాష్ట్రంలో అనేక పదవులను అధిష్ఠించి వాటికి వన్నె తెచ్చారు. శాసనసభలో చాలా కాలంపాటు ఆయనతో గడిపే భాగ్యం కలిగింది. సబ్జెక్ట్‌ ఏదైనా, సమస్య ఏదైనా.. అప్పటికప్పుడు సమాధానం చెప్పగల నిష్ణాతుడు రోశయ్య. ఆయన మృతి తెలుగు ప్రజానీకానికి తీరని లోటు’’ - మాజీ మంత్రి ఈటల రాజేందర్


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని