
TS News: కేసుల పెరుగుదల థర్డ్‌వేవ్‌కు సంకేతం: డీహెచ్ శ్రీనివాసరావు
హైదరాబాద్: కరోనా థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రజారోగ్యశాఖ సంచాలకులు (డీహెచ్) శ్రీనివాసరావు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 130 దేశాలకు ఒమిక్రాన్ వ్యాపించిందని.. మనం దేశంలోనూ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణలోనూ గత రెండు మూడు రోజులుగా ఎక్కువయ్యాయన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో డీహెచ్ మాట్లాడారు.
ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోందని.. ప్రస్తుతం కేసుల పెరుగుదల థర్డ్‌వేవ్‌కు సంకేతమన్నారు. డెల్టా వేరియంట్ కంటే 30 రెట్ల వేగంతో ఒమిక్రాన్ వ్యాప్తి ఉందని చెప్పారు. అయితే కేసుల పెరుగుదలపై ప్రజలు అంతగా భయపడాల్సిన అవసరం లేదన్నారు. గత రెండు వేవ్‌ల్లో నేర్చుకున్న పాఠాలతో ప్రభుత్వం, వైద్యారోగ్యశాఖ సిద్ధంగా ఉందని.. ప్రజలెవరూ ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని.. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఒమిక్రాన్ నుంచి రక్షించుకోవచ్చాన్నారు. ఒమిక్రాన్ సోకిన వారిలో 90 శాతం మందికి వ్యాధి లక్షణాలు కనిపించడం లేదని డీహెచ్ అన్నారు. లక్షణాలు కనిపించినవారు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. నూతన సంవత్సర వేడుకల్లో జాగ్రత్తలు తీసుకోవాలని.. సంక్రాంతి తర్వాత థర్డ్‌వేవ్ వచ్చే అవకాశముందని డీహెచ్ శ్రీనివాసరావు చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.