Rain in Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. జలమయమైన రహదారులు

జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నగరంలోని ఖైరతాబాద్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌ నగర్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, లక్డికాపూల్‌, నాంపల్లి, యూసుఫ్‌గూడ..

Updated : 13 Sep 2023 15:50 IST

హైదరాబాద్: జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. శివారుప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. నగరంలోని ప్రధాన ప్రాంతాలైన బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌ నగర్‌, లక్డికాపూల్‌, నాంపల్లి, యూసుఫ్‌గూడ, శ్రీనగర్‌ కాలనీ తదితర ప్రాంతాల్లో వర్షంపాతం నమోదైంది. కూకట్‌పల్లి, నిజాంపేట, కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. సికింద్రాబాద్‌ పరిధిలోని కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, చింతల్, సూరారం కాలనీలోనూ వర్షం కురిసింది. భారీ వర్షంతో నగరంలోని రహదారులు చెరువులను తలపించాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పాతబస్తీ బహదూర్‌పురా వద్ద రహదారిపైకి భారీగా వరద నీరు రావడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. మాదాపుర్ శిల్పారామం సమీపంలో ప్రధాన రహదారిపై భారీగా చేరిన వరద నీరడంతో పాటు డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. యూసుఫ్‌గూడలో వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. మైత్రివనం చౌరస్తాలో వాహనాల రాకపోకలు బంద్ అయ్యాయి. 

నగరంలో వర్షపాతం నమోదు ఇలా.. 

జూబ్లీహిల్స్‌లో 9.78 సెం.మీలు, అల్లాపూర్‌ వివేకానంద నగర్‌లో 9.6 సెం.మీలు, మాదాపూర్‌లో 8.75 సెం.మీలు, మోతీనగర్‌ వార్డు ఆఫీస్‌లో 7.96 సెం.మీలు, విరాట్‌నగరల్‌లో 7.93 సెం.మీలు, యూసఫ్‌గూడలో 7.63 సెం.మీలు, బాలానగర్‌లో 7.15 సెం.మీలు, శ్రీనగర్‌ కాలనీలో 6.75 సెం.మీలు, జీడిమెట్లలో 5.85 సెం.మీలు, కేపీహెచ్‌బీలో 5.68 సెం.మీలు, గాజులరామరంలో 5.63 సెం.మీలు, షాపూర్‌నగర్‌లో 5.48 సెం.మీలు, కూకట్‌పల్లిలో 5.45 సెం.మీలు, బంజారాహిల్స్‌లో 5.35 సెం.మీలు, టోలీచౌకీలో 5.25 సెం.మీలు, వనస్థలిపురంలో 5.18 సెం.మీల వర్షపాతం నమోదైంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని