AP News: నెల్లూరు జిల్లాను ముంచెత్తిన వర్షాలు.. సోమశిల జలాశయానికి భారీ వరద

అల్పపీడనం కారణంగా గత మూడు రోజులుగా నెల్లూరు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.

Updated : 29 Nov 2021 16:45 IST

నెల్లూరు: అల్పపీడనం కారణంగా గత మూడు రోజులుగా నెల్లూరు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో సోమశిల జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనూ వానలు పడుతుండటంతో సోమశిల జలాశయం ఎగువ ప్రాంతాల్లో ఉన్న ఉప నదులు, వాగులు పొంగుతున్నాయి. దీంతో సోమశిలకు 96వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు ద్వారా 1.16 లక్షల క్యూసెక్కుల నీటిని పెన్నా నదికి విడుదల చేస్తున్నారు. సోమశిల జలాశయంలో ప్రస్తుతం నీటి నిల్వ 68 టీఎంసీలుగా ఉంది.

స్వర్ణముఖి నది ఉద్ధృతి..

మరోవైపు స్వర్ణముఖి నది ఉద్ధృతితో నెల్లూరు జిల్లా నాయుడుపేట బిక్కుబిక్కుమంటోంది. చిత్తూరు జిల్లాలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నాయుడుపేటలోని బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తోంది. పెళ్లకూరు మండలంలోని అనేక గ్రామాల్లో పొలాలు నీట మునిగాయి. వందలాది ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది. ఆత్మకూరు మండలం జలదిగ్బంధలో చిక్కుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, పెన్నా వరదతో ఆత్మకూరు చెరువును తలపిస్తోంది. ఇళ్లు మునగడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చేజెర్ల మండలం నాగులవెల్లటూరు, పాతపాడు చెరువులకు గండ్లు పడ్డాయి. గూడూరు పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని