AP News: జాయింట్‌ స్టాఫ్ కౌన్సిల్‌ భేటీని బహిష్కరించిన ఉద్యోగ సంఘాలు

పీఆర్‌సీ అమలు సహా ఉద్యోగుల ఇతర డిమాండ్ల అమలుపై మరోసారి జరుగుతున్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌ భేటీ నుంచి పలు ఉద్యోగ సంఘాలు బయటికొచ్చాయి.

Updated : 12 Nov 2021 19:04 IST

అమరావతి: పీఆర్‌సీ అమలు సహా ఉద్యోగుల ఇతర డిమాండ్ల అమలుపై మరోసారి జరుగుతున్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌ భేటీ నుంచి పలు ఉద్యోగ సంఘాలు బయటికొచ్చాయి. ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ తీరుకు నిరసన వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి బయటికి వచ్చేశారు. ఈ సమావేశంలో సీఎస్‌ కాకుండా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి, ఇతర అధికారులు మాత్రమే హాజరయ్యారు. దీంతో ప్రభుత్వ వైఖరిపై ఆయా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సమావేశంలో పీఆర్‌సీ నివేదికను బహిర్గతం చేస్తామని చెప్పినప్పటికీ దానికి సంబంధించి అధికారుల నుంచి ఏ విధమైన స్పందన లేకపోవడంతో ఉద్యోగ సంఘాలు బయటకు వచ్చారు. మొత్తం 13 ఉద్యోగ సంఘాలు సమావేశానికి హాజరు కాగా.. 9 ఉద్యోగ సంఘాలు సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించాయి.

పీఆర్‌సీ నివేదిక ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస్‌ ఆరోపించారు. ఇవాళ కూడా ఉద్యోగులను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు మాత్రం సమావేశంలో పీఆర్‌సీ నివేదిక ఊసే ఎత్తడం లేదని రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. పీఆర్‌సీ నివేదికపై అధికారుల కమిటీ మళ్లీ అధ్యయనం చేయడం ఏమిటని ప్రశ్నించారు. సమావేశంలో తాము అడిగిన అంశాలకు స్పష్టంగా సమాధానం చెప్పలేదన్నారు. అక్టోబరు 29 నాటి భేటీలో ఇస్తామన్న నివేదిక ఇంత వరకు ఇవ్వలేదని, కనీసం ఇవాళ్టి సమావేశంలో అయినా ఇస్తారని ఆశించామని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోకుంటే కార్యాచరణ ప్రకటిస్తామని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని