Omicron: చిన్నారులపై ఒమిక్రాన్‌ ప్రభావమెంత..? లక్షణాలు ఏంటి..?

అమెరికా, యూరప్‌ దేశాల్లో నిత్యం లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నారులపై ఒమిక్రాన్‌ ప్రభావం ఎలా ఉంటోందనే విషయంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Updated : 05 Jan 2022 04:51 IST

జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కొవిడ్‌ ఉద్ధృతి పెరుగుతున్నట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికా, యూరప్‌ దేశాల్లో నిత్యం లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నారులపై ఒమిక్రాన్‌ ప్రభావం ఎలా ఉంటోందనే విషయంపై ఆందోళన వ్యక్తమవుతోంది. విస్తృత వేగంతో వ్యాపిస్తోన్న ఈ వేరియంట్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారులకు కూడా వైరస్‌ సోకే ముప్పు కూడా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చిన్నారులకు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రాకపోవడం ఓ కారణంగా నిపుణులు చెబుతున్నారు.

అమెరికాలో పెరుగుతున్న కేసులు..

కొవిడ్‌ ఉద్ధృతి అధికంగా ఉన్న అమెరికాలో.. చిన్నారుల్లో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. అమెరికన్‌ పిడియాట్రిక్స్‌ అకాడమీ (ఏఏపీ) గణాంకాల ప్రకారం క్రిస్మస్‌ నాటికే అక్కడ దాదాపు 2లక్షల పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. వీటిలో కొందరికి ఆస్పత్రుల్లో చేర్పించాల్సిన అవసరం కూడా ఏర్పడుతున్నట్లు తెలిసింది. అంతేకాకుండా అమెరికాలో ఇప్పటివరకు కొవిడ్‌ కారణంగా 8లక్షల 20వేల మంది మృత్యువాతపడగా వారిలో 803 మంది చిన్నారులు (0 నుంచి 18ఏళ్ల వయసు) ఉన్నారు. ఇక చిన్నారులపై ప్రత్యేకంగా ఒమిక్రాన్‌ తీవ్రత అధికంగా లేనప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతున్నందునే ఆస్పత్రుల్లో చేరికలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఏఏపీ పేర్కొంది. అయినప్పటికీ పిల్లల్లో వ్యాధి తీవ్రత తక్కువగానే ఉందని ఇటీవల నివేదికలో వెల్లడించింది.

ముప్పు అందుకే..

చిన్నారుల్లో కొవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వారిలో వ్యాధి లక్షణాలు మాత్రం తక్కువగానే ఉంటున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా కొవిడ్‌ ఉద్ధృతి ప్రభావం చిన్నారులపై అంతగా కనిపించడం లేదని స్పష్టం చేస్తున్నారు. తాజాగా పెరుగుతోన్న ఉద్ధృతికి అటు డెల్టాతోపాటు ఒమిక్రాన్‌ కూడా కారణమవుతున్నప్పటికీ వీటి ప్రభావం చిన్నారులపై అంతగా కనిపించలేదని భారత్‌లోని వైద్య నిపుణులూ చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నారులకు ఇప్పటికీ వ్యాక్సిన్‌ అందని కారణంగా వారికి కొవిడ్‌ ముప్పు పొంచివుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు.

లక్షణాలు..

దేశవ్యాప్తంగా కొత్త వేరియంట్‌ కేసులు ఇప్పటికే 2వేలకు చేరువయ్యాయి. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో పాజిటివ్‌ వచ్చిన నమూనాల్లో ఎక్కువగా ఒమిక్రాన్‌వే ఉంటున్నాయి. ఇదే సమయంలో పిల్లల్లోనూ కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తున్నట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా జ్వరం, ముక్కుకారడం, గొంతు నొప్పి, తల నొప్పితో పాటు పొడిదగ్గు వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు.

ఇదిలాఉంటే, అమెరికాలో చిన్నారులకు వ్యాక్సిన్‌ పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే 12ఏళ్ల వయసు పైబడిన వారిలో 84శాతం మందికి రెండు డోసుల్లో వ్యాక్సిన్‌ అందగా.. 5 నుంచి 11ఏళ్ల వయసున్న వారిలో 15శాతం పిల్లలకు వ్యాక్సిన్‌ పూర్తయ్యింది. ఇటు భారత్‌లోనూ అర్హులైన 90శాతం మందికి ఒకడోసు వ్యాక్సిన్‌ అందింది. చిన్నారులకు మాత్రం వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాలేదు. దీంతో చిన్నారులకు ముప్పు ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందుకే మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేసుకోవడం వంటి కొవిడ్‌ నిబంధనలు పాటించాలని పేర్కొంటున్నారు. అదే సమయంలో ఇంట్లో తల్లిదండ్రులతోపాటు పెద్దవారు జాగ్రత్తలు పాటించడం వల్ల పిల్లలకు వైరస్‌ సోకకుండా నివారించవచ్చని సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని