Vizag steel plant: కేంద్ర అఫిడవిట్‌ను నిరసిస్తూ.. ఉక్కు కార్మికుల ఆందోళన 

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిపాలన భవనం వద్ద కార్మిక నేతలు ఆందోళన చేపట్టారు.

Updated : 29 Jul 2021 11:03 IST

విశాఖపట్నం: ఉక్కు కార్మికుల ఉద్యమం ఉద్ధృతమవుతోంది. ఇందులో భాగంగా ఇవాళ పరిశ్రమ పరిపాలన భవనం వద్ద కార్మిక నేతలు ఆందోళన చేపట్టారు. ఉక్కు పరిశ్రమ విషయంలో హైకోర్టుకు కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌ను నిరసిస్తూ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ పోరాట సమితి ఉద్యమిస్తోంది. పెద్ద సంఖ్యలో పరిపాలన భవనం వద్దకు చేరుకున్న కార్మికులు కేంద్ర ప్రభుత్వానాకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో కార్మికులు షిఫ్ట్ కార్మికులు వెళుతున్న బస్సులను అడ్డుకున్నారు. కార్మికుల ఆందోళనలతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఈ నేపథ్యంలో పరిపాలనా భవనం వద్ద పెద్ద సంఖ్యలో సీఐఎస్‌ఎఫ్‌ బృందాలు పహారా కాస్తున్నాయి. 

విశాఖ ఉక్కు పరిశ్రమలో 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణపై కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (సీసీఈఏ) కూలంకషంగా చర్చించిందని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు నిన్న నివేదించింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను సవాలు చేస్తూ సీబీఐ మాజీ జేడీ, ‘జాయిన్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఫౌండేషన్‌’ ఛైర్మన్‌ వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ దాఖలుచేసిన ప్రజాహిత వ్యాజ్యానికి విచారణ అర్హత లేదని, దాన్ని కొట్టేయాలని కోరింది. పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ (ఆర్థిక మంత్రిత్వశాఖ) శాఖ కార్యదర్శి రాజేష్‌కుమార్‌ సింగ్‌ ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని