Ugadi: ఆ సంకల్పంతోనే ఉగాదికి స్వాగతం పలుకుదాం: గురుదేవ్‌ శ్రీశ్రీ రవిశంకర్‌

ఉగాది పర్వదినం వేళ గురుదేవ్‌ శ్రీశ్రీ రవిశంకర్‌ ప్రత్యేక సందేశం విడుదల చేశారు. ఉగాది వేడుకలను ఆనందంగా ఎలా చేసుకోవాలో ఆధ్యాత్మిక సారాన్ని జోడించి వివరించారు.

Published : 08 Apr 2024 17:23 IST

బెంగళూరు: అప్పటివరకు స్తబ్దుగా ఉన్న విశ్వం చైతన్యవంతమై మేలుకునే సమయం వసంత రుతువు. ఫాల్గుణ అమావాస్య గడిచి చైత్రమాసపు తొలి పొద్దు పొడిచే వేళ, వసంత రుతువు ఆగమనానికి సూచికగా భారతదేశంలోని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో ఉగాదిగా, మహారాష్ట్రలో గుడిపడ్వాగా సింధీయులు వేటి చాంద్‌గా, మణిపుర్‌లో సాజీబు నొంగ్మా వంబగా, బాలి, ఇండోనేషియా వంటి దేశాల్లో నైయిపి పండుగగా ఈ పర్వదినాన్ని చేసుకుంటారు.

ప్రకృతిలోని చెట్లు పాత ఆకులను రాల్చి, కొత్త చిగుళ్లను స్వాగతించినట్లే.. మనం కూడా గతంలోని ప్రతికూలతలను విడిచిపెట్టి.. వర్తమానాన్ని సరికొత్త శక్తితో స్వీకరించాల్సిన సమయమిది. మనం (గత జీవితంలో జరిగిన సంఘటనల మూలంగా) బాధితులమనో, అపరాధులమనే భావనల్లో చిక్కుకున్నప్పుడు వర్తమానాన్ని స్వీకరించడమనేది సవాల్‌గా మారుతుంది. అందువల్ల ఈ కొత్త సంవత్సరం రోజున, గతేడాదిలో మీకు బాధ కలిగించిన వారందరినీ క్షమించి, మీ జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించండి.

నూతన సంవత్సర వేడుకల్ని చేసుకొనేటప్పుడు మనం కాలాన్ని గౌరవిస్తాం. కాలాన్ని గౌరవించడమంటే మనసును గౌరవించడం.. అంటే మీ ఆత్మను గౌరవించడం. మన ఆత్మను గౌరవించుకోవడమంటే నేను అపరాధిని కాను.. బాధితుడినీ కాను అని తెలుసుకోవడమే. మనల్ని మనం గౌరవించుకోకుండా ఆపేది ఏమిటి? మనం దోషులమని నమ్మడం ఒక కారణం. మనం పాపులమని అనుకుంటే, ఎప్పటికీ మన ఆత్మకు దగ్గరకాలేం. మనతో మనం శాంతిగా ఉండలేం.. అపరాధ భావన నుంచి బయటపడినప్పుడే శాంతి నెలకొంటుంది. మనమే కాంతి అని, మనమే విశ్వవ్యాప్తమైన ప్రేమ కిరణాలమని తెలుసుకోవాలి. ఏ షరతులూ లేని సార్వత్రికమైన ప్రేమను అనుభవంలో పొందాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. అయితే, మనం అపరాధభావన నుంచి బయటపడినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. 

అపరాధ భావన (తప్పు చేశాననే భావన) ఒకవైపు ఉంటే, మరోవైపు నేను బాధితుడిని అనే భావన ఉంటుంది. మీరు బాధితులని అనుకుంటే, జీవిత సత్యాన్ని ఎప్పటికీ వ్యక్తపరచలేరు. ప్రేమ, జ్ఞానం, ఆనందం  వీటి అన్ని పార్శ్యాలనూ వెలికితీసి అందరికీ అందించినపుడే ఈ భూమిపై మన ఉనికికి ప్రయోజనం. వాటన్నిటినీ సంపూర్ణంగా ఆవిష్కరించడమే నిజమైన వేడుక. మీరు పరిస్థితులు, కాలం, సంఘటనలు, లేదా వ్యక్తుల మూలంగా నేను బాధితుడిని కానని భావించినప్పుడు మాత్రమే మీరు ఉత్సవం జరుపుకోగలరు. 

నేను బాధితుడిని (బాధితురాలిని) అనే భావనను మనం ఎలా అధిగమించగలం? మీ ఫిర్యాదులన్నింటినీ వదిలివేయండి. మీరు అనుభవించిన అన్ని బాధాకరమైన అనుభవాలు మీకు గాఢతను, సహజత్వాన్ని ఇచ్చాయని గ్రహించండి. అందుకు వాటికి కృతఙ్ఞతలు చెప్పండి. మీకు లభించిన ఆహ్లాదకరమైన అనుభవాలు మీకు మరింత సేవ చేసే అవకాశాన్ని ఇచ్చాయి. వాటికి కూడా ధన్యవాదాలు తెలపండి. ఆహ్లాదకరమైన రోజులు మిమ్మల్ని మీ నిజమైన సామర్థ్యాన్ని గుర్తించేలా చేస్తాయి. మీరు నిజంగా ఆనందమే అని తెలిపి, ఆనందాన్ని వ్యక్తపరిచేలా చేస్తాయి. ఆహ్లాదకరమైన, బాధాకరమైన జ్ఞాపకాలన్నింటికీ కృజతజ్ఞతలు తెలపడం ద్వారా మనము బాధితులం అనే భావనను అధిగమించగలుగుతాం.

జీవితం చేదు, తీపిల కలయిక అని, ఆనంద, విషాదాల సమ్మేళనమని గుర్తుచేసుకుంటూ, కర్ణాటకలో, తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఉగాది రోజున వేప పువ్వు, బెల్లంతో ఉగాది పచ్చడి చేసుకొని ఆరగిస్తారు. నేను సంతోషంగా ఉంటాను, పదిమందికీ సంతోషాన్ని పంచుతాను అనే సంకల్పంతో ఈ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. మీ వద్దకు వచ్చినవారెవరూ ప్రేమను, ఆనందాన్ని అనుభూతి చెందకుండా పంపించకండి. ఈ భూగ్రహం మీద ఉన్న ప్రజలలో ఒక శాతం మంది ధ్యానం చేసినా, అది మిగిలిన వారందరికీ ఉపశమనం కలిగిస్తుంది. అందువల్ల ఈ సంవత్సరం మనం ప్రతిఒక్కరం ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందేలా చూద్దాం. జీవితాన్ని పండగలా చేసుకొనేందుకు మౌలిక సూత్రాలు ఇవి. 

మన జీవితంలో కొన్ని ఆహ్లాదకరమైన, కొన్ని బాధాకరమైన సంఘటనలు జరిగాయి. వాటినుంచి మనం ఏం నేర్చుకున్నాం? ఒకసారి గత సంవత్సరంలో ఏమేం సాధించారో గమనించుకుని, రాబోయే సంవత్సరంలో ఏం సాధించాలనుకుంటున్నామో దానికోసం సంకల్పం తీసుకుందాం. సకల మానవాళికి ఈ ‘క్రోధి’ నామ సంవత్సరం శుభప్రదం కావాలని ఆశిద్దాం!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని