Surya Grahan 2022: సూర్యగ్రహణం.. తెలుగు రాష్ట్రాల్లో మూతపడిన ప్రధాన ఆలయాలు

సూర్య గ్రహణం కారణంగా నేడు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలను మూసివేశారు. తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఉదయం 8 గంటలకు మూసివేయగా.. రాత్రి 7.30 గంటల తిరిగి తెరవనున్నారు.

Updated : 25 Oct 2022 14:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సూర్య గ్రహణం కారణంగా నేడు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలను మూసివేశారు. తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఉదయం 8 గంటలకు మూసివేయగా.. రాత్రి 7.30 గంటల తిరిగి తెరవనున్నారు. ఈ సందర్భంగా అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను తితిదే రద్దు చేసింది. ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తుల దర్శనానికి అనుమతి ఇస్తారు. విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయాన్ని ఉదయం 11 గంటలకు మూసివేశారు. బుధవారం ఉదయం 6 గంటలకు దేవతామూర్తులకు స్నపనాభిషేకాలు నిర్వహిస్తారు. అనంతరం అర్చన, మహానివేదన, హారతి కార్యక్రమాలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. విశాఖ జిల్లాలోని సింహాచలం, శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి ఆలయాలను మూసివేశారు. తితిదే అనుబంధ ఆలయాలతో పాటు చాలా చోట్ల ఇతర ఆలయాలు కూడా మూసివేశారు.

తెలంగాణలోని యాదాద్రి ఆలయాన్ని మంగళవారం ఉదయం 8.50 నుంచి మూసివేసి బుధవారం ఉదయం 8 గంటలకు తెరుస్తారు. నేడు జరిగే నిత్య, శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవంతో పాటు బుధవారం జరిగే శత ఘటాభిషేకం, సహస్ర నామార్చన, సుదర్శన నరసింహ హోమం రద్దు చేశారు. రేపు ఉదయం 10.30 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. భద్రాచలం రామాలయం ఈరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మూసివేస్తారు. వరంగల్‌ భద్రకాళి ఆలయం, హనుమకొండ వేయి స్తంభాల గుడిని మూసివేయనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని