ISS : అంతరిక్షంలో వ్యోమగాములు తినలేని ఆహార పదార్థాలేంటో తెలుసా..?

అంతరిక్షమంటే మనలో అందరికీ ఆసక్తే. ఇక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లో వ్యోమగాములు భార రహిత స్థితిలో ఏది చెసినా మనకో వింతే.

Updated : 04 Apr 2022 05:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ :  అంతరిక్షమంటే మనలో అందరికీ ఆసక్తే. ఇక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లో వ్యోమగాములు భారరహిత స్థితిలో ఏది చేసినా మనకో వింతే. మనం భూమిపై చాలా సులభంగా చేసే పనులు కూడా అక్కడ అత్యంత కఠినంగా మారతాయి. తినే ఆహారం దగ్గరి నుంచి.. తాగే నీటి వరకూ వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉండాల్సిందే. 

నాసా వెబ్‌సైట్‌ ప్రకారం.. పండ్లు, మాకరోనీ, క్యాండీలు, గింజలు, వేరుశనగ, వెన్న తదితర పదార్థాలను వ్యోమగాములు తింటారు. అయితే, ఇవి పాడవకుండా ప్రత్యక పద్ధతిలో ప్యాక్‌ చేసి అక్కడికి పంపుతారు. వ్యోమగాములు ఎలాంటి పదార్థాలను తింటారో మనకు తెలుసు.. అయితే.. వారు అక్కడ ఏం తినకూడదో తెలుసా?. అంతరిక్షంలో ఏయే ఆహార పదార్థాలపై నిషేధం ఉందో తెలుసుకుందాం..

ముఖ్యంగా ఈ ఐదు రకాలు వినియోగించరు..

  1. ఉప్పు, చక్కెర : ఈ రెండింటిని వాటి అసలు రూపంలో అంతరిక్షంలోకి అనుమతించరు. ఎందుకంటే భార రహిత స్థితిలో ఉన్నప్పుడు ఆహార పదార్థాలపై వీటిని వ్యోమగాములు చల్లుకోలేరు. ఇవి అక్కడి వాతావరణంలో తేలుతూ కళ్లు, నోరు, ముక్కులో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. అందుకే వీటిని ద్రవరూపంలో అక్కడికి తరలిస్తారు. ఇవి ఘన రూపంలో ఉంటే పరికరాల్లోకి కూడా చేరి సమస్యలు సృష్టించే అవకాశం ఉంది.
  2. బ్రెడ్స్‌, కుకీస్‌.. : సాధారణంగా అంతరిక్షంలోకి బ్రెడ్స్‌లాంటి వాటిని తీసుకెళ్లరు. వాటి జీవిత కాలం తక్కువగా ఉంటుంది. అలాగే కుకీలు, క్రాకర్ల వంటివి అంతరిక్షంలో తేలుతూ సున్నితమైన పరికరాల్లో ఇరుక్కుపోతాయి. వీటికి బదులుగా వ్యోమగాములు టోర్టిల్లాలను తింటారు.
  3. సోడా.. : సోడా వంటి పానీయాలలోని కార్బొనేషన్‌ భూమిపైకంటే అంతరిక్షంలో భిన్నంగా ప్రవర్తిస్తుంది. ఫలితంగా కార్బన్‌డైయాక్సైడ్‌ బుడగలు ద్రవరూపంలోనే ఉండి అక్కడి పరిస్థితులకు ఇబ్బందికరంగా మారతాయి.
  4. ఆల్కహాల్‌.. : సాధారణంగా ఐఎస్‌ఎస్‌లో ఆల్కహాల్‌ వినియోగంపై నాసా  నిషేధం విధించింది. ఎందుకంటే అంతరిక్ష కేంద్రాన్ని వ్యోమగాములు అత్యంత ఏకాగ్రతతో 24X7 పర్యవేక్షించాల్సి ఉంటుంది.
  5. ఆస్ట్రోనాట్‌ ఐస్‌క్రీమ్‌.. : ఐస్‌క్రీమ్‌లాంటి పదార్థాలు.. సున్నితమైన పరికరాలకు ఆటంకాలు కలిగిస్తాయి. మైక్రోగ్రావిటీలో మురికి వాతావరణాన్ని సృష్టించే ప్రమాదముంది. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని