Morning Walk Tips: ఈ టిప్స్‌తో మార్నింగ్‌ వాక్‌.. మరింత ఉత్సాహంగా

మనలో చాలా మంది లేవగానే సెల్‌ఫోన్‌ చూడటం.. లేదా ఇంటిపనులతో రోజును  ప్రారంభిస్తాం. అలా కాకుండా.. కొంత సమయం మార్నింగ్‌ వాకింగ్‌కి కేటాయిస్తే వాటికొచ్చే లాభాలే వేరంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజంతా యాక్టివ్‌గా ఉండటంతో పాటు ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్‌ మన సొంతమవుతుంది.

Published : 14 Feb 2022 01:05 IST

మనలో చాలా మంది నిద్ర లేవగానే సెల్‌ఫోన్‌ చూడటం.. లేదా ఇంటిపనులతో రోజును ప్రారంభిస్తారు. అలా కాకుండా.. కొంత సమయం ఉదయపు నడకకి కేటాయిస్తే దాన్నుంచి లాభాలే వేరంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజంతా చురుగ్గా ఉండటంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి మన సొంతమవుతుందంటున్నారు. ఇప్పటి వరకూ ఉదయపు నడకకి వెళ్లని మీరు.. ఇకపై అయినా వెళ్లాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్‌ పాటించండి.

ఆ పాటలు వింటూ మొదలుపెట్టండి..

అప్పటి వరకూ వాకింగ్‌ అంటే అలవాటు లేని వారు సడెన్‌గా వాకింగ్‌ అంటే ఆసక్తి చూపకపోవచ్చు. దాన్ని దూరం చేసేందుకు మీకు నచ్చిన పాటలు వింటూ వాకింగ్‌ ప్రారంభించండి. దీని కోసం మ్యూజిక్‌ యాప్స్‌.. ప్రత్యేకంగా మార్నింగ్‌ వాక్‌ సాంగ్స్‌ కలెక్షన్స్‌ను తీసుకొచ్చాయి. ఇందులో రన్నింగ్‌ చేయాలనుకునే వారికోసం ఎనర్జిటిక్‌ పాటలు, వాకింగ్‌ చేసేవారికి మెలోడీలు అందుబాటులో ఉంటాయి..  మీ మూడ్‌ను ఎనర్జిటిక్‌ చేస్తాయి.

వీటిని నిర్లక్ష్యం చేయొద్దు..

వాకింగ్‌కి ఎనర్జీ ఉంటే సరిపోదు.. సరైన దుస్తులను ఎంపిక చేసుకోవాలి. వాకింగ్‌, జాగింగ్‌ ఏదైనా సరే. తేలికైన దుస్తులు, సరైన షూ సైజ్‌ను ఎంపిక చేసుకోవాలి. అప్పుడే వాకింగ్‌ అంతా సౌకర్యంగా, ఎగ్జైటింగ్‌గానూ ఉంటుంది.

వార్మప్‌ ఎందుకు చేయాలంటే..

ఎలాంటి వ్యాయామైనా సరే.. ముందు వార్మప్‌ తప్పక చేయాలి. వార్మప్‌ శరీరాన్ని రిఫ్రెష్‌ చేయడమే కాదు.. మనం చేయబోయే వ్యాయామానికి సంబంధించి మెదడును సిద్ధం చేసి ఉంచుతుంది. వ్యాయామాలకు ముందు మన శరీరం పూర్తి విశ్రాంతి స్థితిలో ఉంటుంది. అలాంటి సమయంలో ఒక్కసారిగా భారం మోపితే కండరాలు, కీళ్లు గాయాలపాలయ్యే అవకాశాలు అత్యధికంగా ఉంటాయి. శరీరంలోని గుండెను, ఊపిరితిత్తులను, మెదడును, కండరాలను, కీళ్లను.. ముఖ్యంగా మనసును వ్యాయామం చేయడానికి ఇది సిద్ధం చేస్తుంది. వార్మప్‌ చేసేప్పుడు ఈ  జాగ్రత్తలు తప్పనిసరి.

  • నడక, జాగింగ్‌, స్కిప్పింగ్‌లలో ఒకదాన్ని 3-4 నిమిషాలు చేయాలి. నిదానంగా మొదలుపెట్టి నెమ్మదిగా తీవ్రతను పెంచాలి. తరువాత మునివేళ్లపై నడవడం, హైనీస్‌, బట్‌కిక్స్‌, నడుము తిప్పడం వంటివి చేయవచ్చు.
  • నడుమును వంచి చేతులను పాదాలకు తాకించడం, పాదాలను, భుజాలను తిప్పడం వంటివి చేయాలి. ఇవి కీళ్లను వ్యాయామానికి సిద్ధం చేస్తాయి.
  • ముఖ్యంగా శీతాకాలంలో చలికి కండరాలు వెంటనే సహకరించవు. కాబట్టి మీ ఆరోగ్యానికి తగినట్టు ఈ వార్మప్స్‌కి (స్ట్రెచింగ్‌, యాంకిల్‌ సర్కిల్స్‌, స్వింగ్‌, ఆర్మ్‌ సర్కిల్స్‌) ప్రాధాన్యమివ్వండి.

ఆ ఛాలెంజ్‌ ఉంటేనే కిక్‌..

ఏ పని అయినా సరే..! సవాళ్లు లేకుంటే కిక్‌ ఉండదు. సవాళ్లు ఉంటేనే ఇంకా ఇంకా చేయాలనే తాపత్రయం పెరుగుతుంది. అందుకే ఉదయపు నడకలోనూ లక్ష్యాన్ని పెట్టుకోండి. అప్పుడే ఆసక్తి పెరుగుతుంది. ఉదాహరణకు ఓ రోజు 30 నిమిషాలు వాకింగ్‌ చేస్తే.. మరుసటి రోజు 40నిమిషాలు చేయండి. అలా రోజురోజుకి సమయంతో పాటు వాకింగ్‌ స్పీడ్‌ని పెంచండి. మీకు తెలియకుండానే మీలో ఆత్మవిశ్వాసం, శక్తీ రెండూ పెరుగుతాయి.

కారణాలు చెప్పి.. ఆపకండి..

బయట వాతావరణం బాగోలేదని చెప్పి వాకింగ్‌కు వెళ్లలేనంటూ కారణాలు చెప్పకండి. ఈ చిన్నపాటి నిర్లక్ష్యమే ఫిట్‌గా ఉండనివ్వకుండా చేస్తుందని గుర్తించండి. బయట చలి తీవ్రంగా ఉంటే.. జిమ్‌కి వెళ్లండి, అదీ కాదు అనుకుంటే ఇంట్లోనే ట్రేడ్‌మిల్‌ని (treadmill) ఏర్పాటు చేసి దానిపై వాకింగ్‌ చేయండి.

మీకు తెలుసా..!

  • రోజుకు సుమారు 7వేల అడుగులు నడిచేవారికి అన్ని రకాల కారణాలతో సంభవించే మరణం ముప్పు తగ్గుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ మసాచుసెట్స్‌ అధ్యయనం పేర్కొంటోంది.
  • అదే 10వేల అడుగులు నడిస్తే ఇంకాస్త ఎక్కువ ఫలితం కనిపిస్తుంది. అలాగని ఎక్కువ వేగం అవసరం లేదు. మామూలు వేగంతో నడిచినా చాలు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని