Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 15 Apr 2023 21:09 IST

1. మరో అయిదు పరీక్షలకు కొత్త తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ

మరో అయిదు ఉద్యోగ నియామక పరీక్షలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(TSPSC)వాయిదా వేస్తూ కొత్త తేదీలను ప్రకటించింది. ఈనెల, వచ్చేనెలలో జరగాల్సిన అయిదు పరీక్షలను వాయిదా వేసిన టీఎస్‌పీఎస్సీ.. కొత్త తేదీలను ప్రకటించింది. ఈనెల 23న జరగాల్సిన అసిస్టెంట్‌ మోటర్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ నియామక పరీక్షను జూన్‌ 28కి వాయిదా వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. తితిదే అవసరాలకు 12 రకాల ప్రకృతి వ్యవసాయోత్పత్తులు

అన్నమయ్య భవన్‌లో  తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  తిరుపతిలోని స్విమ్స్‌ పరిధిలో ఉన్న శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాలలో టీబీ, చెస్ట్‌, స్కిన్‌ ఇతర ఐసోలేషన్‌ వార్డులు, స్టాఫ్‌ క్వార్టర్స్‌, హాస్టళ్ల నిర్మాణ పనుల కోసం రూ.53.62 కోట్లు మంజూరు చేసినట్టు ఛైర్మన్‌ సుబ్బారెడ్డి తెలిపారు. సమావేశం ముగిసిన తర్వాత పాలక మండలి నిర్ణయాలను ఛైర్మన్‌ మీడియాకు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. టీఎస్‌పీఎస్‌సీ కేసులో సీఎం కేసీఆర్‌ రాజీనామా చేయాలి: బండి సంజయ్‌

టీఎస్‌పీఎస్‌సీ కేసులో సీఎం కేసీఆర్‌ రాజీనామా చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. వరంగల్‌లో నిర్వహించిన భాజపా ‘నిరుద్యోగ మార్చ్‌’ సభలో బండి సంజయ్‌ పాల్గొన్నారు. కాకతీయ కూడలి నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. టీఎస్‌పీఎస్సీ పరీక్ష రాసి నష్టపోయిన బాధిత యువతకు రూ.లక్ష పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ‘సచిన్‌ పైలట్‌ కన్నా గహ్లోత్‌కే కాంగ్రెస్‌ ప్రాధాన్యం!’

రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌, సచిన్‌ పైలట్‌ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. దీన్ని లక్ష్యంగా చేసుకుని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అధికార కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. సచిన్‌ పైలట్‌ కన్నా గహ్లోత్‌కే కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రాధాన్యం ఇస్తుందని, ఎందుకంటే అవినీతి సొమ్ముతో పార్టీ ఖజానాను నింపడంలో ఆయన సహకారమే ఎక్కువగా ఉందని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. మా క్రికెటర్లు ఎక్కడా ఆడేది లేదు: బీసీసీఐ!

టీమ్‌ఇండియా క్రికెటర్లు మరే దేశంలోనూ క్రికెట లీగుల్లో ఆడేదిలేదని ఇప్పటికే భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మరోసారి ఈ మేరకు కీలక ప్రకటన చేసినట్లు ఓ నివేదిక పేర్కొంది. ఐపీఎల్‌ (IPL) లీగ్‌ మాదిరిగానే తమ దేశంలోనూ భారీ లీగ్‌ను ఏర్పాటు చేయండని ఫ్రాంచైజీ యజమానులకు సౌదీ అరేబియా క్రికెట్‌ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. కేజ్రీవాల్‌పై చర్యలు.. సిబల్ ముందే ఊహించారు..!

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)కు సీబీఐ సమన్లు జారీ చేయడంపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్(Kapil Sibal) స్పందించారు. ఈ చర్యలను తాను ముందే ఊహించిన విషయాన్ని గుర్తుచేశారు. అధికార భాజపా ప్రతిపక్ష రహిత భారత్‌ను నెలకొల్పాలని కోరుకుంటోందన్నారు. అంతేగాకుండా తనను ఎదిరించి నిలబడిన నేతల ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తుందని దుయ్యబట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. సూడాన్‌లో ఘర్షణలు.. బయటకు రావొద్దంటూ భారతీయులకు హెచ్చరికలు

ఆఫ్రికా దేశం సూడాన్‌ (Sudan) మరోసారి అల్లర్లతో అట్టుడుకుతోంది. ఆర్మీ, పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణలు చెలరేగడంతో పలు చోట్ల కాల్పులు, బాంబు పేలుళ్లు చోటుచేసుకుంటున్నాయి. దీంతో అక్కడి భారతీయులకు (Indians In sudan) ఇండియన్‌ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. బెంగళూరు భళా.. దిల్లీ మళ్లీ ఢమాల్‌..

వరుసగా రెండు ఓటములతో డీలా పడిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మళ్లీ గెలుపు బాటపట్టింది.  సొంత మైదానంలో దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దిల్లీ 9 వికెట్లు కోల్పోయి 151 పరుగులకే పరిమితమైంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. జయలలిత ఏదీ మర్చిపోరు.. చివరి వరకూ నన్ను సీరియస్‌గానే చూశారు: రాధిక

స్మిత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘నిజం’  కార్యక్రమంలో నటి రాధికా శరత్‌కుమార్‌ సందడి చేశారు. సుప్రియ, స్వప్నదత్‌లతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తన కెరీర్‌ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చినదానిపై మాట్లాడారు. అలాగే, తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ఎస్‌బీఐ ‘అమృత్‌ కలశ్‌’ గడువు పెంపు

ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) తన పరిమితకాల స్పెషల్‌ డిపాజిట్‌ స్కీమ్‌ ‘అమృత్‌ కలశ్‌ డిపాజిట్‌’ (SBI Amrit Kalash) మరోసారి తీసుకొచ్చింది. 400 రోజుల కాలవ్యవధితో ఈ స్కీమ్‌ అందుబాటులో ఉంటుంది. వాస్తవానికి 2023 మార్చి 31తో ఈ స్కీమ్‌ గడువు ముగియగా.. తాజాగా ఈ స్కీమ్‌ను పునరుద్ధరించింది. ఈ పథకం జూన్‌ 30 వరకు అందుబాటులో ఉండనుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని