Amit Shah: ‘సచిన్‌ పైలట్‌ కన్నా గహ్లోత్‌కే కాంగ్రెస్‌ ప్రాధాన్యం!’

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ అవినీతి సొమ్ముతో కాంగ్రెస్‌ ఖజానాను నింపుతున్నారని.. ఈ నేపథ్యంలో సచిన్‌ పైలట్‌కు పార్టీలో అవకాశం రాదని అమిత్‌ షా వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో అమిత్‌ షా పాల్గొని ప్రసంగించారు.

Published : 15 Apr 2023 18:48 IST

జైపుర్‌: రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ (Ashok Gehlot), సచిన్‌ పైలట్‌ (Sachin Pilot)ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. దీన్ని లక్ష్యంగా చేసుకుని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah) అధికార కాంగ్రెస్‌ (Congress)పై విరుచుకుపడ్డారు. సచిన్‌ పైలట్‌ కన్నా గహ్లోత్‌కే కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రాధాన్యం ఇస్తుందని, ఎందుకంటే అవినీతి సొమ్ముతో పార్టీ ఖజానాను నింపడంలో ఆయన సహకారమే ఎక్కువగా ఉందని ఆరోపించారు. రాజస్థాన్‌ (Rajasthan)లోని భరత్‌పుర్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో అమిత్‌ షా పాల్గొని ప్రసంగించారు. సచిన్‌, గహ్లోత్‌లు అధికారం కోసం అనవసరంగా పొట్లాడుతున్నారని.. రాజస్థాన్‌లో వచ్చేది భాజపా ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.

‘వివిధ సాకులతో సచిన్‌ పైలట్‌ ధర్నాలో కూర్చున్నప్పటికీ.. పార్టీలో ఆయనకు అవకాశం మాత్రం రాదు. క్షేత్రస్థాయిలో సచిన్‌ సహకారం గహ్లోత్‌ కన్నా ఎక్కువే ఉండొచ్చు! కానీ, కాంగ్రెస్‌ ఖజానాను నింపడంలో గహ్లోత్‌ సహకారం ఆయనకంటే ఎక్కువ. రాజస్థాన్ ప్రభుత్వాన్ని గహ్లోత్‌ అవినీతికి అడ్డాగా మార్చారు. అవినీతి సొమ్మంతా పార్టీ ఖజానాకు మళ్లించారు’ అని అమిత్‌ షా ఆరోపించారు. రాజస్థాన్‌లో 20కిపైగా పేపర్‌ లీక్‌ ఘటనలు నమోదయ్యాయని, గహ్లోత్‌ సెంచరీ కొట్టాలనుకుంటున్నారా? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. రాజస్థాన్‌ ప్రభుత్వ పాలన ‘3డీ’లపై నడుస్తోందని.. అవి అల్లర్లు, మహిళలతో అనుచిత ప్రవర్తన, దళితులపై అఘాయిత్యాలని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో మూడింట రెండొంతుల మెజార్టీతో అధికారం సాధిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని