Radhika: జయలలిత ఏదీ మర్చిపోరు.. చివరి వరకూ నన్ను సీరియస్‌గానే చూశారు: రాధిక

గాయని స్మిత (Smita) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘నిజం విత్‌ స్మిత’ (Nijam With Smita) టాక్‌ షోలో తాజాగా నటి రాధిక, నిర్మాత స్వప్నాదత్‌, సుప్రియ సందడి చేశారు. తమ కెరీర్‌ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published : 16 Apr 2023 01:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: స్మిత (Smita) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘నిజం’ (Nijam With smita) కార్యక్రమంలో నటి రాధికా శరత్‌కుమార్‌ (radhika) సందడి చేశారు. సుప్రియ, స్వప్నదత్‌లతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తన కెరీర్‌ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చినదానిపై మాట్లాడారు. అలాగే, తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత (Jayalalitha)ను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘ఇప్పటివరకూ జీవితంలో ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. జీవితం ఒక ప్రయాణం. ప్రతిక్షణం ఎంజాయ్‌ చేయాలని తెలుసుకున్నాను. ప్రతి విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ఎక్కువగా ఆలోచించడం మానేశాను. అనుకోకుండా నటి అయ్యాను. నేను చేసిన మొదటి తెలుగు సినిమా ‘న్యాయం కావాలి’. ఆ సినిమా చేస్తున్నప్పుడు నాకు తెలుగు రాదు. శ్రద్ధ పెట్టి నేర్చుకున్నాను. నేర్చుకున్న ప్రతి విషయాన్ని చక్కగా పాటిస్తే తప్పకుండా విజయం దక్కుతుందని తెలుసుకున్నా. రాజకీయ నాయకురాలు కావాలని అనుకోలేదు. అది కూడా అనుకోకుండా జరిగిపోయింది. అప్పట్లో డీఎంకే అగ్రనేత కరుణానిధి కుటుంబంతో నాకు సత్సంబంధాలు ఉండేవి. ఓసారి ఆయన నన్ను కలిసి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత (Jayalalitha)కు వ్యతిరేకంగా ప్రచారం చేయమన్నారు. ఆ విషయం తెలిసిన తర్వాత నుంచి చివరి వరకూ నన్ను కలిసిన ప్రతిసారీ జయ ఒక సీరియస్‌ లుక్‌ పెట్టి.. ‘ఏంటమ్మా ఎలా ఉన్నావు?’ అని అడిగేవారు. రాజకీయపరంగా నా భర్త శరత్‌కుమార్‌తో మైత్రి కలిగి ఉన్నప్పటికీ ఆమె నన్ను సీరియస్‌గానే చూసేవారు. ఆమెతో అంత ఈజీ కాదు. ఆమె ఏదీ మర్చిపోరు’’ అంటూ రాధిక (Radhika) నవ్వులు పూయించారు.

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సుప్రియ (Supriya) తన కెరీర్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘నేను కావాలని ఇండస్ట్రీలోకి రాలేదు. తాతయ్య, చిన్నమామయ్యలను చూసి 17 ఏళ్లకే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా. నా మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. హీరోయిన్‌కు ఉండే కష్టాలు అప్పుడే తెలిశాయి. ‘ఇది నేను చేయలేను’ అంటూ మూడో రోజే సెట్‌ నుంచి పారిపోయా. దర్శకుడు ఇవీవీ సత్యనారాయణ వచ్చి.. ‘ఏంటమ్మా ఇలా ఉన్నావు. కాస్త మేకప్‌.. ముదురు రంగు దుస్తులు వేసుకోని రా’ అని చెప్పేవారు. రెండో షెడ్యూల్‌కే నాలుగుసార్లు సెట్‌ నుంచి పారిపోయా. అప్పుడు కల్యాణ్‌ (pawan kalyan) నా వద్దకు వచ్చి.. ‘‘నువ్వు ఈ సినిమాని ఎలాగైనా పూర్తి చెయ్‌. సినిమా అయ్యాక నీ ఇష్టం’’ అని చెప్పాడు. అలా, ఆ సినిమా పూర్తి చేశా. అది చేస్తోన్న సమయంలోనే మరో మూడు సినిమాలకు హీరోయిన్‌గా అడ్వాన్స్‌ తీసుకున్నా. కష్టపడి అన్నింటినీ పూర్తి చేశా. స్టూడియో చూసుకోవడం తప్ప ప్రతీది నేను ఒక ఆటగానే చూశా’’ అని వివరించారు.

అనంతరం, నిర్మాత స్వప్నదత్‌ (Swapna Dutt) తన కెరీర్‌ గురించి మాట్లాడారు. ‘‘టీవీ ఛానెల్‌ పెట్టినప్పుడు నేను ఎన్నో పరాజయాలను చూశాను. దాని వల్ల 28 ఏళ్ల వయసులోనే కెరీర్‌ పరంగా పెద్ద దెబ్బ తగిలింది. కష్టపడ్డాను. సక్సెస్‌ అందుకుని ఈ స్థాయికి వచ్చాను’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని