Indians In sudan: సూడాన్‌లో ఘర్షణలు.. బయటకు రావొద్దంటూ భారతీయులకు హెచ్చరికలు

సూడాన్‌ (Sudan)లో మరోసారి ఘర్షణలు చెలరేగాయి. కాల్పులు, బాంబుల మోత మోగుతుండటంతో అక్కడి భారతీయులకు మన దేశ రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది.

Published : 15 Apr 2023 17:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆఫ్రికా దేశం సూడాన్‌ (Sudan) మరోసారి అల్లర్లతో అట్టుడుకుతోంది. ఆర్మీ, పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణలు చెలరేగడంతో పలు చోట్ల కాల్పులు, బాంబు పేలుళ్లు చోటుచేసుకుంటున్నాయి. దీంతో అక్కడి భారతీయులకు (Indians In sudan) ఇండియన్‌ ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది.

 ‘‘పలు ప్రాంతాల్లో కాల్పులు, ఘర్షణలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో భారతీయులందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలి. బయటకు వెళ్లకండి. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి. ఆందోళన చెందకుండా తదుపరి అప్‌డేట్స్‌ కోసం ఎదురుచూడండి’’ అని సూడాన్‌లోని భారత ఎంబసీ (Indian Embassy) ట్విటర్‌ వేదికగా దేశ పౌరులను హెచ్చరించింది.

సూడాన్‌ (sudan)లోని పారామిలిటరీ రాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ దళాన్ని సైన్యంలో విలీనం చేసేందుకు రూపొందించిన ప్రతిపాదన.. ఆర్మీ, పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణలకు దారితీసింది. ఈ విషయమై సైన్యాధినేత అబ్దెల్‌ ఫతా అల్‌ బుర్హాన్‌, పారామిలిటరీ కమాండర్ మహ్మద్‌ హందాన్‌ డగ్లో మధ్య కొన్ని వారాలుగా నెలకొన్న విభేదాలు.. ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరాయి.

ఈ క్రమంలోనే సూడాన్‌ రాజధాని ఖార్టూమ్‌ సహా పలు ప్రాంతాల్లో ఆర్మీ, పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇరు వర్గాలు పరస్పరం కాల్పులు, బాంబు దాడులకు పాల్పడ్డారు. దీంతో పౌరులు భయాందోళనలకు గురై వీధుల నుంచి పరుగులు పెట్టారు. ఇదిలా ఉండగా.. సూడాన్‌ అధ్యక్ష భవనం, బుర్హాన్ నివాసం, ఖార్టూమ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని  పారామిలిటరీ రాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రానున్న గంటల్లో ఈ దాడులు మరింత తీవ్రమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని