BCCI: మా క్రికెటర్లు ఎక్కడా ఆడేది లేదు: బీసీసీఐ!

ఐపీఎల్‌ (IPL) తరహాలో తమ దేశంలోనూ లీగ్‌ను ఏర్పాటు చేయాలని సౌదీ అరేబియా ప్రభుత్వం భారీ ఆఫర్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, బీసీసీఐ మాత్రం సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.

Published : 16 Apr 2023 01:35 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా క్రికెటర్లు మరే దేశంలోనూ క్రికెట లీగుల్లో ఆడేదిలేదని ఇప్పటికే భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మరోసారి ఈ మేరకు కీలక ప్రకటన చేసినట్లు ఓ నివేదిక పేర్కొంది. ఐపీఎల్‌ (IPL) లీగ్‌ మాదిరిగానే తమ దేశంలోనూ భారీ లీగ్‌ను ఏర్పాటు చేయండని ఫ్రాంచైజీ యజమానులకు సౌదీ అరేబియా క్రికెట్‌ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా అలాంటి ఆఫర్‌పై బీసీసీఐ స్పందించినట్లు క్రికెట్‌ వర్గాలు తెలిపాయి. తమ టాప్‌ ఆటగాళ్లు ఆడకపోయినా..  విదేశీ లీగుల్లో భాగస్వామ్యం కాకుండా ఫ్రాంచైజీలను మాత్రం అడ్డుకోబోమని స్పష్టం చేసింది. 

‘‘ప్రస్తుతం భారత క్రికెట్‌కు ఆడుతున్న టాప్‌ ప్లేయర్‌ అయినా సరే విదేశీ లీగుల్లో పాల్గొనేందుకు అనుమతించం.  ఐపీఎల్ ఫ్రాంచైజీలు అక్కడికి వెళ్తే మాత్రం ఆపేది లేదు. ఎందుకంటే ఇది వారి వ్యక్తిగత నిర్ణయం. ఇప్పటికే ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు దక్షిణాఫ్రికా, దుబాయ్‌ లీగుల్లో జట్లను సొంతం చేసుకున్నాయి. ప్రపంచంలో ఏ లీగులోనైనా తమ జట్టు ఉండాలని కోరుకోవడంలో ఆయా ఫ్రాంచైజీల తప్పు లేదు’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. 

ఐపీఎల్‌ కంటే అత్యంత ధనిక లీగ్‌ను సౌదీ అరేబియాలో ప్రారంభించాలంటే.. టీమ్‌ఇండియా నుంచి టాప్‌ క్రికెటర్లు ఆడితేనే అది సాధ్యమవుతుంది. బిగ్‌బాష్ లీగ్‌, పాక్‌ లీగ్‌, దక్షిణాఫ్రికా, కరేబియన్ లీగ్‌ల్లో విదేశీ క్రికెటర్లు భారీ స్థాయిలో పాల్గొంటున్నప్పటికీ.. భారత్‌ నుంచి మాత్రం ఒక్కరూ ఆడటం లేదు. క్రికెట్‌ నుంచి వీడ్కోలు పలికితేనే ఆడేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న ఆటగాళ్లు ఆడాలంటే బీసీసీఐ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని