Andhra News: తితిదే ఈవో ధర్మారెడ్డి కుమారుడు మృతి

తితిదే ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి (28) మృతిచెందారు. ఆదివారం మధ్యాహ్నం గుండెపోటుకు గురైన ఆయన్ను చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు.

Updated : 21 Dec 2022 11:21 IST

తిరుపతి: తితిదే ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి (28) మృతిచెందారు. ఆదివారం మధ్యాహ్నం గుండెపోటుకు గురైన ఆయన్ను చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ చంద్రమౌళి చనిపోయారు. అతడు కోలుకునేందుకు ఎక్మో సహా ఇతర చికిత్సలు అందించినా ఫలితం లేకపోయింది.  చంద్రమౌళి మృతిని ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు ఆస్పత్రి ఎగ్జిక్యుటివ్‌ డైరెక్టర్‌, సహ వ్యవస్థాపకులు డాక్టర్‌ అరవిందన్‌ సెల్వరాజ్‌ ప్రకటన విడుదల చేశారు. వైద్యులు శాయశక్తులా కృషి చేసినా ఫలితం లేకపోయిందని.. బుధవారం ఉదయం 8.30 గంటలకు చంద్రమౌళి మృతిచెందారని పేర్కొన్నారు. 

వచ్చే నెలలో వివాహం.. ఇంతలోనే ఇలా..

చంద్రమౌళికి పారిశ్రామికవేత్త, తితిదే చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్‌రెడ్డి కుమార్తెతో వివాహం నిశ్చయమైంది. కొన్నిరోజుల క్రితమే నిశ్చితార్థం జరిగింది. జనవరిలో వీరి వివాహం తిరుమలలో జరగాల్సి ఉంది. రెండు కుటుంబాలవారు శుభలేఖలు పంచుతున్నారు. చెన్నై ఆళ్వారుపేటలోని బంధువులకు ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి చంద్రమౌళి ఆదివారం మధ్యాహ్నం కారులో వెళ్లారు. కాసేపటికే గుండెనొప్పిగా ఉన్నట్లు పక్కనే ఉన్న స్నేహితుడికి చెప్పడంతో వెంటనే సమీపంలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. కొన్ని రోజుల్లోనే వివాహం జరగాల్సి ఉండగా చంద్రమౌళి మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని