Himalayas: మరోసారి కనువిందు చేసిన దృశ్యం

వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న హిమాలయ శిఖర అందాలను మేడ మీద నుంచి చూసి ఆనందించగలమా? అసాధ్యం కదూ!

Updated : 22 May 2021 20:31 IST

లఖ్‌నవూ: వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న హిమాలయ శిఖర అందాలను మేడ మీద నుంచి చూసి ఆనందించగలమా? అసాధ్యం కదూ! కానీ, సాధ్యమైంది. కొవిడ్‌ కట్టడి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌, రెండురోజుల పాటు జోరుగా కురిసిన వర్షాలు, కాలుష్యం లేకపోవడం అన్నీ కలిసొచ్చిన వేళ ఉత్తర్‌ప్రదేశ్‌లోని షహరన్‌పూర్‌ నుంచి వరుసగా రెండో ఏడాది హిమాలయ సౌందర్యం దర్శనమిచ్చింది.

ఆ కనువిందైన చిత్రాలను తన కెమెరాలో బంధించారు ఆ ప్రాంత వాసి డా.వివేక్‌ బెనర్జీ.  ‘‘ఇలాంటి దృశ్యాలు అరుదుగా కనిపిస్తాయి. సుమారు 30-40 ఏళ్ల క్రితం ఇలా హిమాలయాలు దర్శనమిచ్చేవి. ప్రస్తుతం పెరిగిన కాలుష్యం కారణంగా పొగమంచు ఏర్పడటంతో దూరం నుంచి హిమాలయాలను చూడటం సాధ్యమవడం లేదు. ప్రస్తుతం లాక్‌డౌన్‌, రెండు రోజుల పాటు వరుసగా వర్షాలు కురిసి ఆగిపోవడంతో ఆకాశం నిర్మలంగా మారి, ఆ అందాలను చూడటం సాధ్యమైంది. వీటి చూస్తున్నంత సేపు ఎంతో ఆనందించాం’’ అని భావాలను పంచుకున్నారు.

ఐఏఎస్‌ సంజయ్‌ కుమార్‌, అటవీశాఖాధికారి రమేష్‌ పాండే తదితరులు కూడా ఈ ఫొటోను పంచుకున్నారు. గతేడాది లాక్‌డౌన్‌ కారణంగా కాలుష్యం తగ్గిపోవడంతో ఈ సుందర దృశ్యం చాలా సంవత్సరాల తర్వాత కనిపించింది. ఇప్పుడూ అదే పరిస్థితి ఉండటంతో దాదాపు 150 కి.మీ. దూరంలో ఉన్న హిమాలయాలను షహరన్‌పూర్‌ వాసులు నేరుగా చూడగలుగుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని