అల్ట్రాసౌండ్‌ విధానంలో కరోనాకు చికిత్స!

అల్ట్రాసౌండ్‌ వైబ్రేషన్లతో కరోనా వైరస్‌ను నశింపచేసే అవకాశాలున్నాయని అమెరికాకు చెందిన ఎంఐటీ యూనివర్సిటీ పరిశోధకులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

Published : 16 Mar 2021 20:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మానవాళిని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. వైరస్‌ నివారణలో భాగంగా, ఇప్పటికే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. అయితే, చికిత్స కోసం మాత్రం ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా, అల్ట్రాసౌండ్‌ వైబ్రేషన్లతో కరోనా వైరస్‌ను నశింపచేసే అవకాశాలున్నాయని అమెరికాకు చెందిన ఎంఐటీ యూనివర్సిటీ పరిశోధకులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మెడికల్ డయాగ్నొస్టిక్ ఇమేజింగ్‌లో వినియోగించే అల్ట్రాసౌండ్‌ ఫ్రీక్వెన్సీతోనే కరోనా వైరస్ కణాల‌ను ప్రభావితం చేయవచ్చని అంటున్నారు.

అల్ట్రాసౌండ్‌ ఫ్రీక్వెన్సీలకు కరోనా వైరస్‌ ఏ విధంగా ప్రతిస్పందిస్తుందో కంప్యూటర్‌ అనుకరణల ద్వారా తెలుసుకునేందుకు అమెరికా పరిశోధకులు ఓ విధానాన్ని రూపొందించారు. ఇందులో భాగంగా, 25నుంచి 100 మెగాహెర్ట్జ్స్‌ ఫ్రీక్వెన్సీలను ప్రయోగించి పరీక్షించారు. ఈ స్థాయుల్లో వైరస్‌ ఉపరితలం నుంచి స్పైక్‌ ప్రోటీన్‌ విచ్ఛిన్నమవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇదేవిధమైన ప్రభావం గాలితో పాటు నీటిలోనూ కనిపించినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. అయితే, ఈ ఫలితాలు ప్రాథమికమైనవేనని, వైరస్‌ భౌతిక లక్షణాలకు సంబంధించిన పరిమిత సమాచారం ఆధారంగానే వీటిని అంచనా వేసినట్లు పరిశోధకులు వెల్లడించారు. అయినప్పటికీ, సార్స్‌-కోవ్‌-2తో సహా ఇతర కరోనా వైరస్‌ల అల్ట్రాసౌండ్‌ ఆధారిత చికిత్సకు ఇది సూచికగా భావించవచ్చని పేర్కొన్నారు. అయితే, అల్ట్రాసౌండ్‌ చేసే విధానం, మావవ శరీరంలో వైరస్‌ను కణాలను నాశం చేసే సామర్థ్యాలను గుర్తించడం శాస్త్రవేత్తల ముందున్న సవాళ్లు అని నిపుణులు అభిప్రాయపడ్డారు.

అల్ట్రాసౌండ్‌ ప్రభావంతో కరోనా వైరస్‌ ఉపరితం, స్పైక్‌లు వైబ్రేషన్‌కు గురయ్యి, వైరస్‌లోని కొన్ని భాగాలను విచ్ఛిన్నం చేయగలమని నిరూపించినట్లు పరిశోధనకు నేతృత్వం వహించిన ఎంఐటీ ప్రొఫెసర్‌ తోమస్‌ వియర్జ్‌బికి వెల్లడించారు. దీంతో వైరస్‌ ఉపరితలంతోపాటు కనిపించని లోపలి ఆర్‌ఎన్‌ఏకు నష్టం కలిగించవచ్చని తెలిపారు. తద్వారా వైరస్‌ నశింపజేయడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కొవిడ్‌ చికిత్స కోసం జరుగుతోన్న పరిశోధనల్లో భాగంగా వివిధ స్థాయిల్లో చర్చకు ఈ పరిశోధన పత్రం ఉపయోగపడుతుందని ప్రొఫెసర్‌ తోమస్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని