Andhra News: నేను వాస్తవాలు చెప్తే.. నాపై దాడి చేశారు: ఎస్సీ మహిళ వెంకాయమ్మ

వైకాపా ప్రభుత్వ పనితీరు బాగోలేదని తాను చెప్పినందుకు తనపై కొంతమంది వైకాపా మహిళా నేతలు దాడి చేశారని గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు చెందిన ఎస్సీ మహిళ

Published : 18 May 2022 01:31 IST

అమరావతి: వైకాపా ప్రభుత్వ పనితీరు బాగోలేదని తాను చెప్పినందుకు తనపై కొంతమంది వైకాపా మహిళా నేతలు దాడి చేశారని గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు చెందిన ఎస్సీ మహిళ వెంకాయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ పాలనపై వెంకాయమ్మ సోమవారం చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో కొంతమంది గతరాత్రి తన ఇంటికి వచ్చి దాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌కు వెంకాయమ్మ రావడంతో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ తదితరులు ఆమెతో మాట్లాడారు. వెంకాయమ్మకు ధైర్యం చెప్పిన నేతలు.. ఆమెకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 

అనంతరం వెంకాయమ్మ మీడియాతో మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో విలేకరులు ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు వాస్తవాలే చెప్పానన్నారు. తన మాటలు నచ్చకపోవడంతో వైకాపా మహిళా నేతలు ఇంటికి వచ్చి గొంతు నొక్కే ప్రయత్నం చేశారని.. దుస్తులు చించివేశారని ఆరోపించారు. టీబీ వ్యాధితో బాధపడుతున్న తనపై కనీస కనికరం కూడా చూపలేదని వెంకాయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆమె చెప్పారు. నక్కా ఆనందబాబు మాట్లాడుతూ వెంకాయమ్మ వాస్తవ పరిస్థితులను చెప్తే ఆమెపై పథకం ప్రకారం దాడి చేశారని ఆరోపించారు. పథకం ప్రకారమే రాష్ట్రంలో దళితులపై దాడులు చేస్తున్నారని ఆయన విమర్శించారు. వెంకాయమ్మ పేదరికంలో ఉన్నా నీతిగా, నిర్భయంగా మాట్లాడిందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని