Venkayya Naidu: గూగుల్‌ ఉన్నా గురువు ప్రాధాన్యత చెక్కు చెదరదు: వెంకయ్యనాయుడు

ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హిమాచల్‌ ప్రదేశ్‌

Published : 13 Feb 2022 01:19 IST

హైదరాబాద్‌: ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ తదితరులు సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారు. చినజీయర్‌ స్వామి, జూపల్లి రామేశ్వరరావు సమతా కేంద్రం విశిష్టతను ఉపరాష్ట్రపతికి వివరించారు. శ్రీరామనగరంలోని 108 దివ్యదేశాలను ఉపరాష్ట్రపతి దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా వెకయ్యనాయుడు మాట్లాడుతూ.... సమతా ప్రతిమ సందర్శన మహద్భాగ్యంగా భావిస్తున్నట్టు చెప్పారు. భారతీయ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సమతామూర్తి ప్రతిమ ప్రేరణ కలిగిస్తుందన్నారు. ఆధ్యాత్మిక వేత్తగా సామాజిక సంస్కరణ అభిలాషి రామానుజాచార్యులు అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ సమానమని వెయ్యేళ్ల కిందటే ఆయన చాటి చెప్పారని గుర్తు చేశారు. ‘‘దళితులను ఆలయ ప్రవేశం చేసి గొప్ప మానవతా వాది అనిపించుకున్నారు. కులం కన్నా గుణం మిన్న అని చాటారు. శ్రీరామనగరంలో సమతామూర్తి విగ్రహాన్ని ఆవిర్భవించడం ఆనందించాల్సిన విషయం. ప్రపంచంలో ఇది ఎనిమిదో అద్భుతం. ప్రపంచ నలుమూలల ఉన్న వ్యక్తులు సమతా మూర్తి విగ్రహాన్ని సందర్శించారు. సమతామూర్తి సుగుణాలను సమాజానికి పంచడమే నిజమైన నివాళి. సమతామూర్తి ప్రతిమ ఏర్పాటులో విశేష కృషి చేసిన చినజీయర్‌ స్వామి, జూపల్లి రామేశ్వర్‌రావుకు భారత ప్రభుత్వం తరఫున అభినందనలు. సమతామూర్తి స్ఫూర్తిని పెంచడమే కాదు.. పంచాలి. సాటి మనిషికి సేవ చేయడమే నిజమైన ఆధ్యాత్మికత. ఆధ్యాత్మిక భావానికి సేవా భావాన్ని జోడించాలి. ఆస్తులు పెంచుకోవడమే కాదు పంచుకోవడంలో ఎంతో అనందం ఉంది. రామానుజాచార్యులు గురువు కోసం చేసిన శ్రమ నేటి యువత నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. గూగుల్‌ ఉన్నా గురువు ప్రాధాన్యత చెక్కు చెదరదు. గూగుల్‌ రిపేర్‌ వచ్చినా గురువు రావాల్సిందే. ఆచార్యులు, పీఠాధిపతులు తమ సందేశాన్ని జనాల దగ్గరికి తీసుకెళ్లాలి’’అని వెంకయ్యనాయుడు అన్నారు. 

సమతామూర్తిని దర్శించుకున్న చిరంజీవి, దిల్‌రాజు

రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో భీష్మ ఏకాదశి పర్వదినం కొత్త సందడి నింపింది. ప్రముఖులతో పాటు వేలాది మంది భక్తులు సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించి ముగ్ధులయ్యారు. మెగాస్టార్‌ చిరంజీవి, దిల్‌రాజు సతీసమేతంగా సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారు. జూపల్లి రామేశ్వరరావు తనయుడు రామ్‌రావు దగ్గరుండి చిరంజీవి, దిల్‌ రాజు దంపతులకు సమతామూర్తి కేంద్రం విశిష్టత, నిర్మాణ ప్రత్యేకతలను వివరించారు. దివ్యదేశాల్లో ఒకటైన శ్రీరంగం ఆలయంలో మెగాస్టార్‌కు అర్చకులు తిలకం దిద్దారు. అనంతరం భద్రవేదికపైకి చేరుకున్న చిరంజీవి.. సమతామూర్తి కేంద్రాన్ని చూసి ముగ్ధులయ్యారు. చిరంజీవి వెంట ప్రముఖ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ కూడా వచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని