Weather Report: తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు.. రాబోయే 3రోజులు తేలికపాటి వర్షాలు

నైరుతి రుతుపవనాలు రాబోయే రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్‌ సముద్రం, అండమాన్‌ నికోబార్‌ దీవులకు ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

Updated : 23 May 2023 17:32 IST

అమరావతి: నైరుతి రుతుపవనాలు రాబోయే రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్‌ సముద్రం, అండమాన్‌ నికోబార్‌ దీవులకు ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర-దక్షిణ ద్రోణి విదర్భ నుంచి ఉత్తర కేరళ వరకు మరఠ్వాడా అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. దక్షిణ తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉంది. ఏపీలో దిగువ ట్రొపోస్పియర్‌ దక్షిణ, నైరుతి దిశలో గాలులు వీస్తున్నాయి. రాబోయే 3రోజుల్లో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పు లేదు. రాగల 3రోజులు ఉత్తర కోస్తా, రాయలసీమలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. ఈదురుగాలులు 30 నుంచి 40 కి.మీ వేగంతో కొన్ని చోట్ల వీచే అవకాశముంది.

తెలంగాణలో...

రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ పడతాయని ప్రకటించిన వాతావరణ శాఖ.. ఎల్లుండి మాత్రం పొడి వాతావరణం ఉంటుందని వివరించింది. రాగల 3 రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పగటి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని, హైదరాబాద్‌ చుట్టు పక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 40 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో వివరించారు.

తక్కళ్లపల్లిలో 44.7డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు..

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఈసాల తక్కళ్లపల్లిలో మంగళవారం అత్యధికంగా 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌ జిల్లాలోని భీమ్‌పూర్‌ మండలం అర్లి(టి)లో 44.4, బేల మండలం చప్రాలలో 44.2, తలమడుగులో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని