Karnataka: మూగజీవాలపై ప్రేమ.. రోజూ 800 శునకాలకు ఆహారం!

మూగజీవాలపై ప్రేమ చూపిస్తూ.. వాటి ఆకలి తీరుస్తోంది ఓ మహిళ. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 800 శునకాలకు ప్రతీరోజూ అన్నం, చికెన్ వండి పెడుతోందామె.

Published : 19 Dec 2021 01:24 IST

మంగళూరు: మూగజీవాలపై ప్రేమ చూపిస్తూ.. వాటి ఆకలి తీరుస్తోంది ఓ మహిళ. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 800 శునకాలకు ప్రతీరోజూ అన్నం, చికెన్ వండి పెడుతోందామె. పక్షులు, పిల్లులను సంరక్షిస్తూ, మూగజీవాల ఆకలి తీరుస్తూ మానవత్వం చాటుకుంటోంది కర్ణాటకలోని మంగళూరుకు చెందిన జంతు ప్రేమికురాలు రజినీ శెట్టి. ఆమె సేవలకు ముగ్ధులైన నెటిజన్లు.. హ్యాట్సాఫ్ అంటూ మెచ్చుకుంటున్నారు.

రోజూ 200 కిలోల అన్నం, చికెన్‌తో వీధి శునకాల ఆకలి తీరుస్తున్నారు రజినీ. ఆ మూగ జీవాలను తన సొంత బిడ్డల్లా ఆమె ఆదరిస్తున్నారు. ఇంత చేస్తున్న ఆమె నివసించేది మాత్రం అద్దె ఇంట్లోనే. మూగజీవాల పరిరక్షణలో భర్త, ముగ్గురు పిల్లలు సైతం ఆమెకు సహకారం అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. సుమారు 800 శునకాలతోపాటు పక్షులు, పిల్లులు సహా మరో 60 జీవాలు కూడా రజనీ సంరక్షణలో ఉంటాయి. అవి బలహీనంగా ఉన్నా.. అనారోగ్యంగా ఉన్నా.. ఆకలితో ఉన్నా.. ఆమె వాటిని తన ఇంటికి తీసుకెళ్లి సేవలు చేస్తారు. వాటి బాగోగులు దగ్గరుండి చూసుకుంటారు. జంతువుల ప్రాణాలు కాపాడేందుకు ఎంత సాహసానికైనా ఆమె వెనకాడరు. ఈ ఏడాది ఫిబ్రవరిలో.. 45 అడుగుల లోతున్న బావిలో పడిన ఓ శునకాన్ని రక్షించేందుకు తాళ్ల సాయంతో ఆమె బావిలోకి దిగారు. ఆ శునకాన్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్‌ అయ్యింది. రజనీ ధైర్యసాహసాలు, జంతువుల పట్ల ఆమె చూపుతున్న ప్రేమను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. శునకంతో రజనీ ఆప్యాయంగా మాట్లాడుతున్న మరో వీడియో కూడా ప్రజల నుంచి విశేష మన్ననలు పొందింది. తాను 15 ఏళ్లుగా మూగజీవాలకు సేవ చేస్తున్నట్టు రజనీ చెప్పారు. జంతువులను కాపాడటం 20 ఏళ్ల క్రితమే ప్రారంభించినట్టు తెలిపారు. 800 శునకాలకు ఆహారం అందించేందుకు రోజూ సుమారు 5 కిలోమీటర్లు ప్రయాణిస్తానని ఆమె వివరించారు.

Read latest General News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని