బిగ్‌టెక్‌ కంపెనీల గుత్తాధిపత్యానికి చెక్‌..!

ఇన్నాళ్లు ఆడిందే ఆట.. పాడిందే పాటగా గుత్తాధిపత్యాన్ని సాగించిన బిగ్‌ టెక్‌ కంపెనీలు.. మున్ముందు ఆ పరిస్థితులు కొనసాగించే పరిస్థితులైతే కనిపించడం లేదు. వీటికివ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ ఏకమవుతుండమే ఇందుకు కారణం.

Updated : 11 Nov 2022 18:28 IST

ఇన్నాళ్లూ ఆడిందే ఆట.. పాడిందే పాటగా గుత్తాధిపత్యాన్ని సాగించిన బిగ్‌ టెక్‌ కంపెనీలు.. మున్ముందు ఆ పరిస్థితులు కొనసాగించే పరిస్థితులైతే కనిపించడం లేదు. వీటికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ ఏకమవుతుండడమే ఇందుకు కారణం. భారత్‌, అమెరికా, యూరోపియన్‌ దేశాలు, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, ఇండోనేసియా వంటి దేశాలు టెక్‌ కంపెనీలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వాటి గుత్తాధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. పోటీదారులను వెనక్కి నెట్టి అనైతిక వ్యాపార పద్ధతులను అవలంబించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. వార్తా సంస్థలకు చెల్లింపులు, వినియోగదారుల డేటా, యాప్స్‌, పేమెంట్స్‌ వ్యాపారాన్ని దుర్వినియోగం చేయడం, స్థానిక చట్టాలను ఉల్లంఘించడం, పన్ను ఎగవేతలు వంటి వాటిని తీవ్రంగా ప్రశ్నిస్తున్నాయి. ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడడంలో గూగుల్‌ ముందు వరుసలో ఉండగా.. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, అమెజాన్‌ వంటివీ ఈ జాబితాలో ఉన్నాయి.

అనైతిక వ్యాపార పద్ధతులను అవలంబిస్తూ గుత్తాధిపత్యాన్ని సాగిస్తున్న గూగుల్‌కు ఇటీవలే భారత కాంపీటీషన్‌ కమిషన్‌ భారీ జరిమానా విధించింది. ఆండ్రాయిడ్‌ ఓఎస్‌, ఆండ్రాయిడ్‌ మొబైల్‌ యాప్స్‌ విషయంలో మొత్తం రూ.2,274 కోట్ల జరిమానా విధించింది. తన ఆండ్రాయిడ్‌ టీవీ ఓఎస్ ద్వారా ఎల్‌జీ, శాంసంగ్‌, అమెజాన్‌ కంపెనీలకు చెందిన టీవీ ఓఎస్‌లకు మోకాలడ్డుతున్న అంశాన్నీ మూడో కేసుగా సీసీఐ విచారిస్తోంది. ఇది కాకుండా ఇండియన్‌ న్యూస్‌పేపర్స్‌ అసోసియేషన్‌ (INA), న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌, డిజిటల్‌ అసోసియేషన్‌ (NBDA), డిజిటల్‌ న్యూస్‌ పబ్లిషర్స్‌ అసోసియేషన్‌ (DNPA) వంటి సంఘాలు ఇప్పటికే సీసీఐకి ఫిర్యాదు చేశాయి. గూగుల్‌ న్యూస్‌ ఫీడ్‌లో తమ వార్తలను ప్రచురిస్తూ.. ఆదాయం పంపిణీ విషయంలో మాత్రం సహేతుకంగా వ్యవవహరించడం లేదని తమ ఫిర్యాదులో పేర్కొన్నాయి.

తమ వార్తలను ప్రచురించినందుకు గానూ తగిన రీతిలో చెల్లింపులు చేయాలన్న వార్తా సంస్థల కోరికను ఇన్నాళ్లూ గూగుల్‌ను పెడచెవిన పెడుతూ వచ్చిందని డీఎన్‌పీఏకు చెందిన వర్గాలు పేర్కొన్నాయి. ఇకపై ఆ పెత్తనం ఎంతమాత్రం కొనసాగబోదని, దేశ చట్టాలు మున్ముందు అందుకు అనుమతించబోవని పేర్కొన్నారు. బిగ్‌ టెక్‌ కంపెనీల ఆధిపత్యాన్ని తగ్గించాల్సి ఉందని ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ అన్నారు. దేశ నెటిజన్లు, డిజిటల్‌ న్యూస్‌ మీడియా సంస్థలు, ఇతర భాగస్వామ్య పక్షాల హక్కులను రక్షించే దిశగా డిజిటల్‌ ఇండియా యాక్ట్‌ను తీసుకొస్తున్నామని చెప్పారు. వచ్చే ఏడాది ఈ చట్టం అమల్లోకి రానుందన్నారు. మరోవైపు అమెరికాలో సైతం త్వరలో రెండు బిల్లులు రాబోతున్నాయి. ఇవి వస్తే బిగ్‌ టెక్‌ కంపెనీల ఆధిపత్యానికి కళ్లెం పడనుంది. గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి టెక్‌ కంపెనీల నుంచి చర్చల ద్వారా తమ వాటాను పొందేందుకు వీలుగా అమెరికాలో ఇప్పటికే ఓ చట్టం తీసుకొచ్చారు. ఈయూ సైతం ఓ బిల్లు తీసుకురాబోతోంది. ఇలా ప్రపంచదేశాలన్నీ బిగ్‌ టెక్‌ కంపెనీల ఆధిపత్యానికి చెక్‌ పెట్టేందుకు సన్నద్ధమవుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని