Violence in Manipur: మణిపుర్‌ ఘర్షణలు.. పతకాలు వెనక్కి ఇచ్చేస్తామంటూ అథ్లెట్ల లేఖ

Violence in Manipur:మణిపుర్ రాష్ట్రం గత కొద్దికాలంగా ఘర్షణల్లో చిక్కుకుపోయింది. ఈ పరిస్థితిపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పలు వర్గాలకు చెందిన నేతలతో సమావేశం అవుతున్నారు. 

Published : 30 May 2023 18:43 IST

ఇంఫాల్: జాతుల మధ్య వైరంతో మణిపుర్ సంక్షోభం(Violence in Manipur)లో చిక్కుకుపోయింది. భద్రతాబలగాల మోహరింపుతో తాత్కాలికంగా పరిస్థితులను అదుపులోకి తీసుకువస్తున్నా.. ఏ క్షణంలో ఘర్షణలు చెలరేగుతాయో తెలీని వాతావరణం నెలకొని ఉంది. ఈ పరిస్థితిపై అక్కడి క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేశారు. సాధ్యమైనంత త్వరగా ప్రశాంతత నెలకొనకపోతే.. తమ పతకాలు వెనక్కి ఇచ్చివేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా(Amit shah)కు రాసిన లేఖలో ఎనిమిది డిమాండ్లను బయటపెట్టారు. (Violence in Manipur)

ఆ లేఖపై సంతకాలు చేసిన 11 మంది అథ్లెట్లలో ఒలింపిక్ మెడల్‌ విజేత మీరాబాయి చాను,  పద్మా అవార్డు గ్రహీత అయిన వెయిట్‌ లిఫ్టర్ కుంజారాణి దేవి, భారత మహిళా ఫుట్‌బాల్ టీం మాజీ కెప్టెన్ బెం బెం దేవీ, బాక్సర్‌ ఎల్ సరితా దేవీ వంటి ప్రముఖులు ఉన్నారు. ‘గత కొద్దివారాలుగా పలు ప్రాంతాల్లో జాతీయ రహదారి-2ను బ్లాక్‌ చేశారు. దాంతో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. సాధ్యమైనంత త్వరగా అక్కడ సాధారణ పరిస్థితి , రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరించండి. లేకపోతే మా పతకాలను వెనక్కి ఇచ్చేస్తాం’అని అమిత్‌ షాకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. 

ఈ సంక్షోభ పరిస్థితులు సద్దుమణిగేలా చూసేందుకు నాలుగురోజుల పర్యటనలో భాగంగా అమిత్‌ షా ప్రస్తుతం మణిపుర్‌లో ఉన్నారు. ఆయన రాష్ట్రంలోని వివిధ వర్గాలకు చెందిన నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ చర్చలు ఫలవంతంగా సాగుతున్నాయని ట్విటర్ వేదికగా వెల్లడించారు. 

ఘర్షణల మృతుల కుటుంబాలకు పరిహారం..

ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ గత కొన్ని రోజులుగా హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఎస్టీ హోదా కోసం మెయిటీలు చేసిన డిమాండ్‌కు మణిపుర్‌ వ్యాలీ ప్రాంతానికి చెందిన చట్టసభ్యుల నుంచి మద్దతు లభించింది. దీంతో గిరిజన ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇది ఘర్షణకు దారితీసింది. మణిపుర్ జనాభాలో 53 శాతం మంది మెయిటీ వర్గానికి చెందినవారే. మణిపుర్ వ్యాలీలో వారి ప్రాబల్యం ఎక్కువ. బంగ్లాదేశ్‌, మయన్మార్‌ నుంచి వస్తోన్న అక్రమ వలసదారులతో తాము సమస్యలు ఎదుర్కొంటున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్టీ హోదా విషయంలో మెయిటీలు, గిరిజనులకు మధ్య జరిగిన ఘర్షణల్లో పదుల సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. ఇప్పుడు వారి కుటుంబాలకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.10లక్షల పరిహారం ప్రకటించాయి. అలాగే మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చాయి. 

మణిపుర్‌ పర్యటనకు అనుమతి కోరిన దీదీ..

ఈ సమయంలో మణిపుర్ రాష్ట్రంలో పర్యటించి, అక్కడి ప్రజలకు మద్దతుగా నిలిచేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రానికి లేఖ రాశారు. ఈ విషయాన్ని బెంగాల్ ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. మణిపుర్ తరహాలోనే బెంగాల్‌లో కూడా ఘర్షణలు సృష్టించేందుకు భాజపా యత్నిస్తోందని ఇదివరకు మమత ఆరోపించిన సంగతి తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని