ప్రసాదం తిన్న భక్తులకు అస్వస్థత.. ఆరుబయట తాళ్లకు సెలైన్లు వేలాడదీసి చికిత్స!

మహారాష్ట్రలో ప్రసాదం తిని పలువురు భక్తులు అస్వస్థతకు గురయ్యారు. వారికి ఆరుబయటే చికిత్స అందించిన వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది.

Published : 21 Feb 2024 19:12 IST

ముంబయి: మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ప్రసాదం తిని పలువురు భక్తులు అస్వస్థతతకు లోనయ్యారు. వీరందరినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు. సరిపడినన్ని పడకలు లేక ఆరుబయట రోడ్డుపై చెట్లకు తాళ్లు కట్టి సైలైన్లు వేలాడదీసి చికిత్స అందించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

బుల్దానా జిల్లాలో సోమ్తానా గ్రామంలో ‘హరినామ్‌ శపథ్‌’ పేరిట గత కొన్ని రోజులుగా ఓ మతపరమైన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా మంగళవారం సోమ్దానా, ఖాపర్కేడ్‌ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు రాత్రి 10 గంటల సమయంలో ప్రసాదం తిన్నాక అస్వస్థతకు లోనయ్యారు. వీరిలో మహిళలు, చిన్నారులు సైతం ఉన్నారు. కడుపునొప్పి, వికారం, వాంతులతో ఇబ్బందులు పడుతున్న భక్తులను వెంటనే బిబి గ్రామానికి తరలించారు.

ఆస్పత్రిలో సరిపడా పడకలు లేకపోవడంతో ఆస్పత్రి బయట రోడ్డుపైనే వారికి చికిత్స అందించారు. అటూ ఇటూ చెట్లకు తాళ్లు కట్టి.. వాటికి సెలైన్లు వేలాడదీశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వైద్యులు కూడా అందుబాటులో లేరని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతానికి భక్తుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కొందరిని డిశ్చార్జి కూడా చేసినట్లు కలెక్టర్‌ పాటిల్‌ తెలిపారు. మెడికల్‌ ఎమర్జెన్సీ ఏర్పడితే తక్షణమే స్పందించేందుకు ప్రత్యేక వైద్య బృందాన్ని కూడా అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ప్రసాదం శాంపిళ్లను పరీక్షల నిమిత్తం లేబొరేటరీకి తరలించినట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని