Australia: భారత్‌ నుంచి వస్తే అయిదేళ్ల జైలు

కొవిడ్‌ ఉద్ధృతంగా ఉన్న భారత్‌ నుంచి ప్రయాణికుల రాకను ఆస్ట్రేలియా నిషేధించింది. తమ పౌరులు ఎవరైనా దీనిని ఉల్లంఘించి స్వదేశానికి చేరుకునే

Updated : 02 May 2021 08:12 IST

రూ.38లక్షల వరకూ జరిమానా
ప్రయాణాలపై నిషేధం విధించిన ఆస్ట్రేలియా

మెల్‌బోర్న్‌: కొవిడ్‌ ఉద్ధృతంగా ఉన్న భారత్‌ నుంచి ప్రయాణికుల రాకను ఆస్ట్రేలియా నిషేధించింది. తమ పౌరులు ఎవరైనా దీనిని ఉల్లంఘించి స్వదేశానికి చేరుకునే ప్రయత్నం చేస్తే వారికి అయిదేళ్ల వరకూ జైలు శిక్ష, రూ.38లక్షలు (66వేల ఆస్ట్రేలియా డాలర్లు) మేర జరిమానాలలో ఏదో ఒకదానిని లేదా రెండింటినీ విధించనున్నట్లు ప్రకటించింది. తాత్కాలిక నిషేధ ఉత్తర్వులు సోమవారం నుంచి అమలులోకి వస్తాయని, మే 15 తర్వాత పునఃసమీక్షిస్తామని ఆరోగ్య మంత్రి గ్రెగ్‌ హంట్‌ను ఉటంకిస్తూ అక్కడి మీడియా వెల్లడించింది. బయోసెక్యూరిటీ చట్టం-2015ని అనుసరించి నిషేధాన్ని విధించినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. భారత్‌లో ప్రస్తుతం 9వేల మంది ఆస్ట్రేలియన్లు ఉన్నట్లు అంచనా. వీరిలో 600 మంది కరోనా బారిన పడేందుకు అవకాశాలు అధికంగా ఉన్న వ్యక్తులుగా ‘ద సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌’ పత్రిక పేర్కొంది. విదేశాల నుంచి వచ్చే స్వదేశీ పౌరులపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించడం ఇంతకుముందెన్నడూ జరగలేదని ఆస్ట్రేలియన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ తెలిపింది.
మినహాయింపులతో అమెరికా ఆంక్షలు
వాషింగ్టన్‌: తమ దేశ పౌరులు కాని వారు భారత్‌ నుంచి అమెరికా రావడంపై అధ్యక్షుడు జో బైడెన్‌ ఆంక్షలు విధించారు. మే 4 నుంచి కొన్ని మినహాయింపులతో ఈ ఆదేశాలు అమలులోకి రానున్నాయి. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఇవి అమల్లో ఉంటాయి. విద్యార్థులు, పాత్రికేయులు, విద్యావేత్తలు, అమెరికా పౌరసత్వం ఉన్నవారు అమెరికాకు వెళ్లవచ్చు. గ్రీన్‌కార్డుదారులు, అమెరికా పౌరులు కానప్పటికీ వారి జీవిత భాగస్వాములు, 21ఏళ్ల వయసులోపున్న వారి పిల్లలకూ మినహాయింపు వర్తిస్తుంది. దిల్లీలో ఉన్న అమెరికా దౌత్యకార్యాలయం ఓ ప్రకటన విడుదల చేస్తూ...భారత్‌ నుంచి తిరిగి వెళ్లాలనుకుంటున్న అమెరికా పౌరుల కోసం విమానాలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
విదేశీ విద్యార్థుల రాకపై కెనడా నిషేధం
టొరంటో: భారత్‌ సహా పలు దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ విద్యార్థుల రాకపై కెనడా నిషేధం విధించింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్న తమ దేశంలోని ఒంటారియో ప్రాంతానికి విదేశీ విద్యార్థులను అనుమతించబోమని కెనడా అంతర్జాతీయ విద్యా విభాగం(సీబీఐఈ) తెలిపింది. 2020నాటికి కెనడాలో 5,30,540 మంది విదేశీ విద్యార్థులు చదువుకుంటున్నారని, వీరిలో 34శాతం మంది భారత్‌కు, 22శాతం మంది చైనాకు చెందిన వారని సీబీఐఈ వెల్లడించింది.
22 సరిహద్దు కేంద్రాలను మూసివేసిన నేపాల్‌
కాఠ్‌మాండూ: భారత్‌తో తమకున్న 22 సరిహద్దు కేంద్రాలను మూసివేయాలని నేపాల్‌ నిర్ణయించింది. రెండు దేశాల మధ్య మొత్తం 35 సరిహద్దు కేంద్రాలు ఉన్నాయి. తాజా నిర్ణయంతో 13 సరిహద్దు కేంద్రాలు మాత్రమే ఇరు దేశాల ప్రజల రాకపోకలకు అందుబాటులో ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు