Madhya pradesh: ‘జై శ్రీరాం’ అనాలంటూ తుక్కు వ్యాపారిపై దాడి 

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లా మహిద్‌పుర్‌కు చెందిన తుక్కు వ్యాపారి అబ్దుల్‌ రషీద్‌ను

Updated : 30 Aug 2021 15:01 IST

భోపాల్‌/ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లా మహిద్‌పుర్‌కు చెందిన తుక్కు వ్యాపారి అబ్దుల్‌ రషీద్‌ను ‘జై శ్రీరాం’ అనమంటూ ఇద్దరు వ్యక్తులు బెదిరించి దాడికి దిగడంతో నిందితులు ఇద్దరినీ అరెస్టు చేసినట్లు పోలీసులు ఆదివారం వెల్లడించారు. శనివారం జరిగిన ఈ సంఘటన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిద్‌పుర్‌ పోలీస్‌ సబ్‌ డివిజనల్‌ ఆఫీసర్‌ ఆర్‌.కె.రాయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. రషీద్‌ తన వ్యాపారంలో భాగంగా తుక్కు సేకరణకు మినీ ట్రక్కుతో ఝర్దా ఠాణా పరిధిలోని సిక్లి గ్రామానికి వెళ్లినపుడు ఈ సంఘటన జరిగిందన్నారు. రషీద్‌ను గ్రామం నుంచి బలవంతంగా వెళ్లగొట్టి, ‘జై శ్రీరాం’ అనాల్సిందిగా ఆయన మీద దాడి చేసినట్లు తెలిపారు. నిందితులు కమల్‌సింగ్‌ (22), ఈశ్వర్‌సింగ్‌ (27)లను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని ఇండోర్, దేవాస్‌ పట్టణాల్లోనూ గతంలో ఇలాంటి సంఘటనలే జరిగాయని, ప్రభుత్వం మౌన ప్రేక్షకుడిలా మారిందని మధ్యప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ విమర్శించారు. ఇలాంటి వైఖరిని రాష్ట్ర ప్రభుత్వం సమర్థించబోదని, కాంగ్రెస్‌ పార్టీ సామాజిక మాధ్యమ విభాగం నుంచి ఆ వీడియోలు వైరల్‌ కావడం పలు అనుమానాలకు తావిస్తోందని రాష్ట్ర వైద్యవిద్య మంత్రి విశ్వాస్‌ సారంగ్‌ ఎదురుదాడికి దిగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని