రెండు టీకాలు కలిపితే..?

కరోనా టీకా సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు బ్రిటన్‌ యోచిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే మెరుగైన సమర్థతను కనబరిచిన రెండు వ్యాక్సిన్లను కలిపి ఇస్తే ఎలా ఉంటుందో ఆలోచిస్తోంది. ఈ మేరకు ఆక్స్‌ఫర్డ్‌, ఫైజర్‌ వ్యాకిన్లను కలిపి ప్రయోగాలు జరపాలని పరిశోధకులు ప్రణాళికలు.......

Published : 08 Dec 2020 14:33 IST

ప్రయోగాలకు సిద్ధమవుతున్న బ్రిటన్‌

లండన్‌: కరోనా టీకా సామర్థ్యాన్ని మరింత పెంచే అంశాన్ని బ్రిటన్‌ పరిశీలిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే మెరుగైన సమర్థతను కనబరిచిన రెండు వ్యాక్సిన్లను కలిపి ఇస్తే ఎలా ఉంటుందో ఆలోచిస్తోంది. ఈ మేరకు ఆక్స్‌ఫర్డ్‌, ఫైజర్‌ వ్యాకిన్లను కలిపి ప్రయోగాలు జరపాలని పరిశోధకులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏడాది దీనికి సంబంధించిన ప్రయోగాలు‌ ప్రారంభిస్తామని బ్రిటన్‌ వ్యాక్సిన్‌ టాస్క్‌ఫోర్స్‌ వెల్లడించింది. దీనిపై ఇప్పటి వరకు జరిపిన ప్రాథమిక పరిశోధనకు సంబంధించిన వివరాల్ని నివేదిక రూపంలో ప్రచురించారు. తమ స్పుత్నిక్‌-V వ్యాక్సిన్‌ను ఆక్స్‌ఫర్డ్‌ టీకాతో కలిపి ప్రయోగాలు నిర్వహించాలని ఆస్ట్రాజెనెకాను రష్యా ఇటీవల కోరిన విషయం తెలిసిందే. 

టీకాను ప్రజా వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఫైజర్‌ టీకాకు బ్రిటన్‌, బహ్రైన్‌ అత్యవసర వినియోగం కింద అనుమతులిచ్చేశాయి. బ్రిటన్‌లో నేడు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమైంది. మరికొన్ని దేశాల్లోనూ ఈ టీకాలు తర్వలో ఆమోదం పొందే అవకాశాలు ఉన్నాయి. భారత్‌లో సీరం సంస్థ, ఫైజర్‌ సహా తాజాగా దేశీయంగా భారత్‌ బయోటెక్ తయారు చేసిన‌ టీకా వినియోగ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాయి.

జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్‌తో కలిసి ఫైజర్‌ రూపొందించిన కరోనా వ్యాక్సిన్‌ దాదాపు 95 శాతం సమర్థతను చూపిందని సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్‌ సంయుక్తంగా అభివృద్ధిన చేసిన టీకా ఓ రకం డోసుతో 90శాతం మేర సమర్థతో పనిచేస్తున్నట్లు తేలిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో రెండు టీకాలను కలిపితే సమర్థత ఏమైనా మెరుగవుతుందేమో పరీక్షించేందుకు సిద్ధమవుతున్నారు.

ఇవీ చదవండి..
భారత్‌లో టీకా: 2 వారాల్లో అనుమతులు?

కరోనా టీకా సామర్థ్యం కథేంటి?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని