భారత్‌లో టీకా: 2 వారాల్లో అనుమతులు?
close

తాజా వార్తలు

Updated : 08/12/2020 17:12 IST

భారత్‌లో టీకా: 2 వారాల్లో అనుమతులు?

దిల్లీ: కరోనా కోరల నుంచి విముక్తి కోసం యావత్ దేశం ఆశగా ఎదురుచూస్తున్న వ్యాక్సిన్‌ అతి త్వరలోనే భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. కొవిడ్‌ టీకాకు అత్యవసర వినియోగ అనుమతినివ్వాలంటూ ఇప్పటికే ఫైజర్‌, సీరం, భారత్‌ బయోటెక్‌ సంస్థలు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై డీసీజీఐ రెండు వారాల్లోగా సానుకూల నిర్ణయం తీసుకోనున్నట్లు ఆరోగ్య శాఖ వర్గాల సమాచారం. 

ఫైజర్‌, సీరం, భారత్‌ బయోటెక్‌ కంపెనీల విజ్ఞప్తులను కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ(సీడీఎస్‌సీవో)లోని నిపుణుల కమిటీ బుధవారం పరిశీలించనుంది. టీకా పనితీరు, పంపిణీ వంటి అంశాలపై విస్తృతస్థాయిలో చర్చలు జరపుతుంది. ఈ కమిటీ తమ పరిశీలనలను అందించిన తర్వాత రెండు వారాల్లోగా కొవిడ్‌ టీకా అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతులు కల్పించే అవకాశాలున్నట్లు పలు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. దేశంలో కొద్దివారాల్లోనే కొవిడ్‌ -19 టీకా సిద్ధమవుతుందని ఈ నెల 4న జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశాభావం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా వార్తలు మరింత ఊరటనిస్తున్నాయి.

భారత్‌లో టీకా వినియోగానికి అనుమతి కోరిన తొలి సంస్థ ఫైజర్‌. ఆ తర్వాత సీరం, భారత్‌ బయోటెక్‌ సంస్థలు కూడా డీసీజీఐకు దరఖాస్తు చేసుకున్నాయి. అయితే, అవసరంతో పాటు టీకా భద్రత కూడా ముఖ్యమైన అంశమని, అందుకే అత్యవసర అనుమతులు ఇచ్చే ముందు వ్యాక్సిన్‌ సామర్థ్యాలు, భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 

అగ్రరాజ్యం అమెరికా తర్వాత అత్యధిక కరోనా కేసులున్న భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య కోటికి చేరుతోంది. మంగళవారం నాటికి 97,03,770 మంది వైరస్‌ బారిన పడగా.. 1,40,958 మంది కొవిడ్‌కు బలయ్యారు. దీంతో టీకా పురోగతిపై భారత ప్రభుత్వం గట్టిగా దృష్టిపెట్టింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒకే రోజు మూడు నగరాల్లో పర్యటించి వ్యాక్సిన్‌ ప్రయోగాలను పరిశీలించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే భారత్‌లో టీకా అత్యవసర వినియోగ అనుమతులకు దరఖాస్తులు రావడం విశేషం. 

కాగా.. ఇప్పటికే బ్రిటన్‌లో ఫైజర్‌ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి లభించిన విషయం తెలిసిందే. మంగళవారం నుంచే అక్కడ టీకా పంపిణీ ప్రారంభిస్తున్నారు. మన దేశంలో కూడా టీకా అందుబాటులోకి వస్తే తొలి ప్రాధాన్యంగా ఆరోగ్య సిబ్బంది, వృద్ధులకు వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. 

ఇదీ చదవండి..

రోజువారీ కేసులు.. 30వేల దిగువకుTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని