Union Cabinet Decisions: సమగ్ర శిక్షా పథకం మరో ఐదేళ్లు పొడిగింపు

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో పాఠశాల విద్యను మరింత మెరుగుపరిచేందుకు సమగ్ర శిక్షా పథకాన్ని మరో ఐదేళ్లు .....

Published : 04 Aug 2021 19:34 IST

దిల్లీ: కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో పాఠశాల విద్యను మరింత మెరుగుపరిచేందుకు సమగ్ర శిక్షా పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని నిర్ణయించింది. 2018 నుంచి దేశంలో అమలు చేస్తున్న ఈ పథకాన్ని 2026 మార్చి 31వరకు పొడిగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే, దేశంలో మైనర్‌ బాలికలు, మహిళలపై అత్యాచారాల కేసుల సత్వర విచారణ, దోషులకు గరిష్ఠ శిక్షల విధింపు కోసం అమలుచేస్తున్న కేంద్ర ప్రాయోజిత ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ప్రత్యేక పథకాన్ని కూడా మరో రెండేళ్ల పాటు పొడిగించాలని నిర్ణయించింది.

కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలను కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌, అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకు వెల్లడించారు. సమగ్రశిక్ష పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో ప్లే స్కూళ్లను ఏర్పాటు చేయడంతో పాటు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. పాఠశాల విద్యార్థులకు వృత్తివిద్యా కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తారు. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించనున్నారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం కమిషన్‌ ఏర్పాటుకు కేంద్రం సాయం చేస్తుంది. ఈ పథకం కోసం రూ. 2లక్షల కోట్లకు పైగా నిధుల్ని కేటాయించినట్టు కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు.

సమగ్ర శిక్ష పథకం-2గా పిలవబడే ఈ పథకం కోసం మొత్తంగా రూ.2,94,283కోట్లు కేటాయించగా.. ఇందులో కేంద్రం వాటా 1,85,398 కోట్లుగా పేర్కొన్నారు. ఈ పథకం పరిధిలోకి దేశవ్యాప్తంగా 11.60 లక్షల ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలు, 15.6 కోట్ల మంది విద్యార్థులు, 57లక్షల మంది ఉపాధ్యాయులు వస్తారని పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని