WhatsApp: చట్టాలను ఉల్లంఘించేలా ‘గోప్యత’

సామాజిక మాధ్యమం వాట్సప్‌ రూపొందించిన నూతన గోప్యత విధానం (ప్రైవసీ పాలసీ) భారతీయ ఐ.టి.

Updated : 18 May 2021 09:13 IST

దిల్లీ హైకోర్టుకు తెలిపిన కేంద్రం 

దిల్లీ: సామాజిక మాధ్యమం వాట్సప్‌ రూపొందించిన నూతన గోప్యత విధానం (ప్రైవసీ పాలసీ) భారతీయ ఐ.టి. చట్టాలు, నిబంధనలను ఉల్లంఘించేలా ఉందని కేంద్ర ప్రభుత్వం సోమవారం దిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఆ విధానానికే కట్టుబడి ఉందా లేదా అనేది తెలిపేలా వాట్సప్‌ను ఆదేశించాలని కోరింది. ఈ నెల 15 నుంచి అమల్లోకి వచ్చిన వాట్సప్‌ నూతన గోప్యత విధానాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లపై దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.ఎన్‌.పటేల్, జస్టిస్‌ జ్యోతి సింగ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. వాట్సప్‌ తీరు రాజ్యాంగంలోని హక్కులకు విరుద్ధంగా ఉందన్న అంశంపై కేంద్రానికి, ఫేస్‌బుక్, వాట్సప్‌లకు హైకోర్టు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా కేంద్రం తన వాదన వినిపించింది. గోప్యత అంశంపై ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకెర్‌బర్గ్‌కు లేఖ రాశామని, దానికి ఇంకా సమాధానం రావాల్సి ఉందని తెలిపింది. నూతన విధానం అమలుపై యథాతథ స్థితి కొనసాగించాల్సిన అవసరం ఉందంది. కొత్త విధానం అమల్లోకి వచ్చినా దానికి ఆమోదం తెలపనివారి ఖాతాల తొలగింపును తాము ప్రారంభించడం లేదని, అంగీకారం తెలిపేలా అలాంటివారిని ప్రోత్సహిస్తామని తొలుత వాట్సప్‌ తెలిపింది. అందరికీ వర్తించేలా దీని కోసం తాము ఎలాంటి సమయ పరిమితిని విధించుకోలేదనీ, ఒక్కో వాడుకదారుడిని విడివిడిగానే చూస్తామని వివరించింది. భారతీయ ఐ.టి. చట్టాలకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. తదుపరి విచారణ జూన్‌ 3వ తేదీకి వాయిదా పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని