Ajit Doval: రెండు దేశాల మధ్య నమ్మకం పోయింది..: అజిత్‌ డోభాల్‌

భారత్‌-చైనా సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ పేర్కొన్నారు. 

Published : 25 Jul 2023 12:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: 2020లో వాస్తవాధీన రేఖ వెంట చోటు చేసుకొన్న పరిణామాల కారణంగా భారత్‌-చైనా మధ్య వ్యూహాత్మక, ప్రజా, రాజకీయ సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య విశ్వాసం కనుమరుగైందన్నారు. దక్షిణాఫ్రికాలో జరుగుతన్న బ్రిక్స్‌ సమావేశంలో ఆయన చైనా అత్యున్నత దౌత్యవేత్త వాంగ్‌ యీతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరుదేశాల మధ్య ఇబ్బందికర పరిస్థితులను తొలగించేందుకు నిరంతరం చర్యలు చేపట్టాలని అజిత్‌ డోభాల్‌ పేర్కొన్నారు. చైనా పొలిటకల్‌ బ్యూరో సభ్యుడైన వాంగ్‌ యీ బ్రిక్స్‌ సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ దేశ విదేశాంగ మంత్రి కిన్‌ గాంగ్‌ దీనికి గైర్హాజరయ్యారు. చైనా తరపున వాంగ్‌ యీ, భారత్‌ తరపున అజిత్‌ డోభాల్‌ సరిహద్దు సమస్యపై చర్చించేందుకు ప్రత్యేక ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు. ఇక బ్రిక్స్‌ సమావేశంలో డోభాల్‌ మాట్లాడుతూ సైబర్‌ భద్రతపై సమష్టిగా కలిసి పనిచేయాలని మిత్రదేశాలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికా దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు ప్రధాని మోదీ, షీజిన్‌పింగ్‌ బాలీలో జరిగిన జీ20 సమావేశంలో అంగీకరించినట్లు చైనా విదేశాంగ శాఖ ప్రకటించిన కొద్దిసేపటికే.. డోభాల్‌-వాంగ్‌ భేటీపై భారత విదేశాంగ శాఖ ప్రకటన వెలువరించింది. దీనిలో బాలీ సదస్సు అంశం ప్రస్తావించకపోవడం గమనార్హం.

మయన్మార్‌ నుంచి మణిపుర్‌కు.. రెండు రోజుల్లో 700 మంది

మరోవైపు చైనా ప్రతినిధి వాంగ్‌యీ మాట్లాడుతూ.. ఇరు దేశాలు పరస్పరం వ్యూహాత్మక విశ్వాసాన్ని పెంచుకుని.. సహకారంపై దృష్టి పెట్టి అడ్డంకులను దాటాలన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను పూర్వ స్థితికి తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. చైనా ఎప్పుడూ ఆధిపత్య ధోరణి ప్రదర్శించబోదని.. భారత్‌తో సహా ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. బహుళ ధ్రువ ప్రపంచాన్ని, అంతర్జాతీయ సంబంధాల్లో ప్రజాస్వామ్య ధోరణికి చైనా మద్దతు ఇచ్చేందుకు కృషి చేస్తుందన్నారు.

భారత్‌-చైనా సంబంధాలు కేవలం ఇరు దేశాలకే కాక.. ఈ ప్రాంతం మొత్తానికి చాలా కీలకమని వాంగ్‌యీ, డోభాల్‌ అంగీకరించారు. ఇటీవల ఇండోనేషియా రాజధాని జకార్తాలో భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌, వాంగ్‌యీ భేటీ అయ్యారు. వీరిద్దరు సరిహద్దు సమస్యపై చర్చించిన కొన్ని రోజులకే ఈ భేటీ జరగడం విశేషం. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం తన కెరీర్‌లోనే అత్యంత కఠిన సమస్యగా ఇటీవల జైశంకర్‌ వ్యాఖ్యానించారు. ఈ వివాదం తేలనంత వరకు ఇరు దేశాల సంబంధాలు సాధారణ స్థితికి రావడం అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు