Anand Mahindra: షోరూంలో రైతుకు అవమానం.. ఇంటికే వచ్చి బొలెరో డెలివరీ

కర్ణాటకలోని మహీంద్రా షోరూంలో రైతుకు జరిగిన అవమాన ఘటన సుఖాంతమైంది. రైతు కెంపెగౌడ ఆర్డర్ చేసిన బొలెరో పికప్​ ట్రక్కును సిబ్బంది

Updated : 31 Jan 2022 04:48 IST

రైతును తమ సంస్థ కుటుంబంలోకి ఆహ్వానించిన ఆనంద్‌ మహీంద్రా

బెంగళూరు: కర్ణాటకలోని మహీంద్రా షోరూంలో రైతుకు జరిగిన అవమాన ఘటన సుఖాంతమైంది. రైతు కెంపెగౌడ ఆర్డర్ చేసిన బొలెరో పికప్​ ట్రక్కును సిబ్బంది ఇంటికే వచ్చి అప్పగించారు. ఈ మేరకు షోరూంలో పనిచేసే సిబ్బంది, అధికారులు గౌడకు క్షమాపణలు చెప్పారు. ‘షోరూం సిబ్బంది వాళ్లంతట వాళ్లే వచ్చి బొలెరో పికప్​ ట్రక్కు డెలివరీ చేశారు. ‘ఇలాంటి అవమానం ఎవరికీ జరగకూడదనే నేను కోరుకుంటున్నా. వాహనాన్ని సమయానికి వచ్చినందుకు సంతోషంగా ఉంది’ అని కెంపెగౌడ ఆనందం వ్యక్తం చేశారు.

ఈ డెలివరీపై అంతకుముందే మహీంద్రా ఆటోమోటివ్ ట్వీట్ చేసింది. రైతుకు, ఆయన స్నేహితులకు జరిగిన అవమానానికి చింతిస్తున్నట్లు తెలిపింది. ‘జనవరి 21న మహీంద్రా షోరూంలో రైతు కెంపెగౌడ, ఆయన స్నేహితులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. ఇచ్చిన మాటకు కట్టుబడి తగిన చర్యలు తీసుకున్నాం. సమస్య ఇప్పుడు పరిష్కారమైంది. మా వాహనాన్ని ఎంచుకున్నందుకు కెంపెగౌడకు ధన్యవాదాలు. మహీంద్రా కుటుంబంలోకి స్వాగతం’ అంటూ ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. ఈ ట్వీట్‌పై మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్‌ మహీంద్రా స్పందించారు. సంస్థ కుటుంబంలోకి కెంపెగౌడను ఆహ్వానిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు.

ఇదీ వివాదం

బొలెరో పికప్‌ వాహనాన్ని కొనేందుకు రైతు కెంపెగౌడ ఈనెల 21న తుమకూరులోని మహీంద్రా షోరూంకి వెళ్లాడు. అయితే ఆ రైతును అవమానిస్తూ వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని సేల్స్‌మెన్‌ దురుసుగా ప్రవర్తించాడు. ఆ కారు ధర ₹10 లక్షలని పేర్కొంటూ.. నీ వద్ద 10 రూపాయలు కూడా ఉండవంటూ హేళన చేశాడు. దీంతో వారి మధ్య వాదన మొదలైంది. దీన్ని అవమానంగా భావించిన కెంపెగౌడ సేల్స్‌మెన్‌కు ఛాలెంజ్‌ విసిరి.. ఓ గంటలో రూ.10 లక్షలతో మళ్లీ షోరూంకి వెళ్లాడు.

రైతు వద్ద ఆ డబ్బు చూసిన సేల్స్‌మెన్‌ కంగుతిన్నాడు. వెయిటింగ్‌ లిస్ట్‌ ఉందని, వాహనాన్ని వెంటనే డెలివరీ చేయలేమని సిబ్బంది పేర్కొన్నారు. కనీసం నాలుగు రోజులు పట్టొచ్చని తెలిపారు. కాగా దురుసుగా ప్రవర్తించిన సేల్స్‌మెన్‌ క్షమాపణలు చెప్పాలని కెంపెగౌడతోపాటు అతని స్నేహితులు డిమాండ్‌ చేశారు. దీంతో మళ్లీ వారిమధ్య వాగ్వాదం చెలరేగింది. విషయం పోలీసుల వరకు వెళ్లడంతో.. రంగంలోని దిగిన వారు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. విషయం తెలుసుకొని ఆ సేల్స్‌మెన్‌తో కెంపెగౌడకు క్షమాపణలు చెప్పించారు.

ఘటనపై స్పందించిన మహీంద్రా

ఈ వివాదంపై ఆనంద్‌ మహీంద్రా మరుసటిరోజు ట్విటర్‌ వేదికగా స్పందించారు. తప్పుచేసినవారిపై చర్యలు తీసుకుంటామన్నారు‘మా కంపెనీ ప్రధాన ఉద్దేశం.. అన్ని వర్గాల వారిని అభివృద్ధి చేయడమే. వ్యక్తుల మర్యాదను కాపాడటం మా ప్రధానమైన నైతిక విలువ. ఈ సిద్ధాంతాన్ని ఎవరు అతిక్రమించినా.. వారిపై తక్షణమే చర్యలు ఉంటాయి’ అని మహీంద్రా వెల్లడించారు. అటు మహీంద్రా ప్రతినిధులు కూడా దీనిపై స్పందించారు. కస్టమర్లను గౌరవిస్తూ.. వారికి ఉత్తమ సేవలు అందించాల్సిన బాధ్యత డీలర్లపై ఉందన్నారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని