Rahul Gandhi: ఆ నిశ్శబ్ద శక్తే నడిపించింది: రాహుల్ గాంధీ

గత ఏడాది సెప్టెంబర్‌లో కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు జోడో యాత్ర జరిగింది. ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆ యాత్ర అనుభవాలను గుర్తు చేసుకున్నారు. 

Published : 15 Aug 2023 11:52 IST

దిల్లీ: కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్వాతంత్ర్య దినోత్సవం వేళ నెట్టింట్లో పోస్టు పెట్టారు. భరత మాత ప్రతిఒక్కరి స్వరమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా భారత్‌ జోడో యాత్ర(Bharat Jodo Yatra) అనుభవాలను పంచుకున్నారు. ప్రజల ఆదరణతో అందిన నిశ్శబ్ద శక్తి తనకెంతో సహకరించిందన్నారు.

‘బలం, బలహీనతతో సంబంధం లేకుండా భారత మాత.. ప్రతి భారతీయుడి గళం. ఆ గళంలో ఆనందం, భయం, బాధ అంతర్గతంగా దాగి ఉంటుంది. ఈ భరత మాత గళం వినేప్పుడు నా సొంత గళం, నా సొంత ఆకాంక్షలను నిశ్శబ్దంగా ఉంచాను. వినయంగా, నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ గళం వినిపిస్తుంది’ అని అన్నారు.

త్వరలో కొత్త పథకం.. ₹లక్షల్లో ప్రయోజనం: మోదీ

‘జోడో యాత్ర ప్రారంభంలో నా పాత గాయం తిరగబెట్టింది. మోకాలి నొప్పి ప్రారంభమైంది. కానీ నాతో కలిసి ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. వారు అందించిన ఆదరణతో ఆ నొప్పి మటుమాయం అయింది. ప్రతిసారి ఆ యాత్రను ఆపేద్దామనుకున్నప్పుడల్లా.. ఎవరో ఒకరు వచ్చి నాలో కొత్త శక్తిని నింపేవారు. అలా నిశ్శబ్ద శక్తి నాకు సహకరించింది. చిమ్మచీకట్లు అలుముకున్న అడవిలో కాంతిని నింపే మిణుగురులవలే నాకు దోహదం చేసింది. ఈ క్రమంలో ఒకరోజు అంతులేని నిశ్శబ్దాన్ని అనుభవించాను. నా చేయి పట్టుకొని నడుస్తున్న వ్యక్తి మాట తప్ప నాకు మరో శబ్దం వినిపించలేదు’ అని యాత్ర అనుభవాలను గుర్తు చేసుకున్నారు. 

గత ఏడాది సెప్టెంబర్‌లో కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు జోడో యాత్ర జరిగింది. అయితే ఈ యాత్ర ముగియలేదని, మళ్లీ మొదలవుతుందని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. ఈసారి గుజరాత్‌ నుంచి మేఘాలయ వరకు ఉంటుందని చెప్పారు. ఇదిలా ఉంటే..ఇటీవల పార్లమెంట్‌లో భరత మాత పదాన్ని వాడుతూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఆ విమర్శలను తిప్పికొట్టేలా ఈ రోజున రాహుల్(Rahul Gandhi) సుదీర్ఘ సందేశాన్ని ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని