Published : 25 Apr 2021 12:29 IST

బైడెన్‌..భారత్‌ అప్పట్లో మనకు సాయం చేసింది!

మిగులు వ్యాక్సిన్లు ఇండియాకు ఇవ్వాలని పలువురి విజ్ఞప్తి

వాషింగ్టన్‌: అమెరికాలో ఉన్న మిగులు వ్యాక్సిన్లను కరోనాతో కొట్టుమిట్టాడుతున్న భారత్‌కు విడుదల చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బైడెన్‌ ప్రభుత్వంపై పలువురు కీలక వ్యక్తులు స్వరం పెంచారు. చట్టసభ సభ్యుడు రాజా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. భారత్‌ సహా మరికొన్ని దేశాల్లో పరిస్థితులు విషమిస్తున్న సమయంలో టీకాలను గిడ్డంగుల్ని ఉంచడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ప్రజల ప్రాణాల్ని కాపాడేందుకు వాటిని అవసరమైన చోటికి తరలించాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికాలో ఇప్పటికే 40 మిలియన్‌ డోసుల ఆస్ట్రాజెనెకా టీకాలు ఉన్నాయన్నారు. వాటిని ప్రస్తుతం వినియోగించడం లేదన్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఆయా దేశాలకు ఆ వ్యాక్సిన్లను విడుదల చేయాలని బైడెన్ ప్రభుత్వాన్ని కోరారు. 

గత కొన్ని నెలల్లో బైడెన్‌ ప్రభుత్వం సంపాదించుకున్న ఘనత క్రమంగా కోల్పోతోందని బ్రూకింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన తన్వీ మదన్‌ అభిప్రాయపడ్డారు. భారత్‌తో వైరం ఉన్న పాకిస్థాన్‌, చైనా సైతం సాయం చేయడానికి ముందుకు వచ్చాయని.. అమెరికా స్పందన మాత్రం ఆశించిన స్థాయిలో లేదన్నారు. భారత్‌లో తన కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యుల్ని కోల్పోయానని అధ్యక్ష ఎన్నికల సమయంలో బైడెన్ ప్రచారం బృందంలో కీలకంగా వ్యవహరించిన భారతీయ అమెరికన్‌ సోనాల్‌ షా తెలిపారు. భారత్‌లో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయని.. వీలైనంత త్వరగా ఏదో ఒకటి చేయాలని బైడెన్‌కు విజ్ఞప్తి చేశారు.

న్యూయార్క్‌ సహా అమెరికా మొత్తం 2020లో కరోనాతో తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో కీలక ఔషధమైన హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని భారత్‌ ఎత్తివేసిన విషయాన్ని ఈ సందర్భంగా హెరిటేజ్‌ ఫౌండేషన్‌ అనే మేధోసంస్థ ప్రతినిధి జెఫ్‌ ఎం స్మిత్‌ గుర్తుచేశారు. ప్రతి అమెరికన్‌కు వ్యాక్సిన్‌ అందించిన తర్వాత కూడా అమెరికాలో 70 మిలియన్‌ డోసులు ఉంటాయని తెలిపారు. అమెరికా వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.  

భారత్‌లో విజృంభిస్తున్న కరోనా అక్కడి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను కుప్పకూల్చే ప్రమాదం ఉందని అమెరికాలో ప్రముఖ వైద్య నిపుణులు ఆశిష్‌ ఝా తెలిపారు. ఒక్క అమెరికా మాత్రమే భారత్‌ పరిస్థితిని చక్కబెట్టడంలో సహాయపడగలదని అభిప్రాయపడ్డారు. అగ్రరాజ్యం ఎంత త్వరగా స్పందిస్తే.. అన్ని ప్రాణాలు నిలబడతాయన్నారు. ఈ మేరకు ఆయన వాషింగ్టన్‌ పోస్ట్‌లో వ్యాసం ప్రచురించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని