Toilet Scam: శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌పై రూ.100కోట్ల పరువునష్టం దావా

శివసేన నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్‌ రౌత్‌పై రూ.100కోట్లకు పరువునష్టం దావా దాఖలైంది. భాజపా నేత కిరీట్‌ సోమయ్య భార్య, ప్రొఫెసర్‌ మేధా ముంబయి హైకోర్టులో ఈ దావా దాఖలు చేశారు.

Published : 24 May 2022 01:11 IST

ముంబయి: శివసేన నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్‌ రౌత్‌పై రూ.100కోట్లకు పరువునష్టం దావా దాఖలైంది. భాజపా నేత కిరీట్‌ సోమయ్య భార్య, ప్రొఫెసర్‌ మేధా బాంబె హైకోర్టులో ఈ దావా దాఖలు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా టాయిలెట్‌ స్కామ్‌ (Toilet Scam) పేరుతో శివసేనకు చెందిన సామ్నా పత్రికలో వస్తోన్న కథనాలు తన పరువుకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని అందులో పేర్కొన్నారు. తదుపరి కథనాలు ఆపడంతో పాటు క్షమాపణలు చెప్పాలంటూ డాక్టర్‌ మేధా తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

మహారాష్ట్ర భాజపా నేత కిరీట్‌ సోమయ్య కుటుంబ సభ్యులు ఓ స్వచ్ఛంద సంస్థను నడిపిస్తున్నారు. అయితే, బాంబె శివారులోని మీరా భయందర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో రూ.100కోట్ల టాయిలెట్‌ స్కామ్‌ (Toilet Scam) జరిగిందని ఆరోపిస్తూ శివసేనకు చెందిన సామ్నా పత్రికలో వరుస కథనాలు వచ్చాయి. అంతకుముందు కూడా సోమయ్య కుటుంబీకులు నడిపిస్తోన్న స్వచ్ఛంద సంస్థకు ఇందులో భాగస్వామ్యం ఉందని సంజయ్‌ రౌత్‌ ఆరోపణలు చేశారు. అనంతరం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇతర మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, వీటిని ఖండించిన కిరీట్‌ సోమయ్య సతీమణి ప్రొఫెసర్‌ మేధా.. ఎటువంటి ఆధారాలు లేకుండానే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తన గౌరవానికి భంగం కలిగించే ఉద్దేశంతోనే అటువంటి వార్తలు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

ఇక మీడియాలో వచ్చిన కథనాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రొఫెసర్‌ మేధా గత నెలలో పోలీసులను ఆశ్రయించారు. తాజాగా న్యాయపరంగా ముందుకు వెళ్లిన ఆమె.. మీడియాలో వస్తోన్న వార్తలు తన పరువుకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని చెబుతూ బాంబే హైకోర్టులో దావా వేశారు. ఇందులో భాగంగా తనకు రూ.100కోట్ల మేరకు నష్ట పరిహారం పొందే అర్హత ఉందని.. వాటి సీఎం రిలీఫ్‌ ఫండ్‌లో జమచేసేలా ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్నారు. అంతేకాకుండా తన పరువుకు నష్టం కలిగించినందున క్షమాపణలు చెప్పడంతో పాటు వ్యక్తిగతంగా తనకు భంగం కలిగించే కథనాలను ప్రచురించకుండా ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్‌ ద్వారా కోర్టుకు డాక్టర్‌ మేధా విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని