INS Vagir: నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్‌ వగీర్‌..!

భారత్‌ చరిత్రలోనే అత్యంత వేగంగా నిర్మించిన సబ్‌మెరైన్‌ నౌకాదళంలో చేరింది. దీని రాకతో భారత్‌ సముద్ర శక్తి బలపడింది.

Published : 23 Jan 2023 11:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత నౌకాదళం(Indian Navy)లోకి మరో జలాంతర్గామి చేరింది. ఐఎన్‌ఎస్‌ వగీర్‌(INS Vagir)ను నౌకాదళానికి అప్పగించే కార్యక్రమం నేడు జరిగింది. ఈ కార్యక్రమంలో నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ పాల్గొన్నారు. ‘‘ఈ సబ్‌మెరైన్‌తో భారత నౌకాదళ సామర్థ్యాలు మెరుగుపడతాయి. దేశ ప్రయోజనాలను ఇది శత్రువుల నుంచి కాపాడుతుంది. అంతేకాదు.. సంక్షోభ సమయంలో కీలకమైన నిర్ణయాత్మకమైన ఇంటెలిజెన్స్‌, నిఘా, పర్యవేక్షణలను అందిస్తుంది’’ అని నౌకాదళం ఓ ప్రకటనలో పేర్కొంది.

ప్రాజెక్టు 75 కింద నిర్మించిన ఐదో డీజిల్‌ ఎలక్ట్రిక్‌ సబ్‌మెరైన్‌ ఇది. ‘వగీర్‌’ అంటే షార్క్‌చేప. నిశ్శబ్దంగా, భయం లేకుండా పనిచేయడం దీని ప్రధాన సామర్థ్యం. ఈ పేరును 1973-2001 వరకు వినియోగించిన ఓ పాత సబ్‌మెరైన్‌ నుంచి తీసుకొన్నారు. ఈ కొత్త సబ్‌మెరైన్‌ను మాజిగావ్‌ డాక్‌ షిప్ బిల్డర్స్‌ నిర్మించింది. దీనికోసం ఫ్రాన్స్‌ నుంచి సాంకేతికత భారత్‌కు బదిలీ అయింది. ఈ సబ్‌మెరైన్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమ సోనార్లను అమర్చారు. అంతేకాదు.. దీనిలో వైర్‌ గైడెడ్‌ టార్పిడోలు కూడా ఉన్నాయి. ఈ జలాంతర్గామి నుంచి సబ్‌ సర్ఫేస్‌ టూ సర్ఫేస్‌ క్షిపణులను ప్రయోగించవచ్చు. దీంతో ప్రత్యర్థి నౌకాదళంపై వేగంగా దాడి చేసే సామర్థ్యం లభిస్తుంది. స్పెషల్‌ ఆపరేషన్ల కోసం శత్రు స్థావరాల్లోకి మెరైన్‌ కమాండోలను పంపించే సామర్థ్యం ఈ జలాంతర్గామికి ఉంది.

సముద్రం మధ్యలో, తీరాలకు అత్యంత సమీపంలో కూడా ఐఎన్‌ఎస్‌ వగీర్‌(INS Vagir)ను మోహరించవచ్చు. దేశీయంగా నిర్మించిన అత్యాధునిక సబ్‌మెరైన్లలో ఇదొకటి. దీనిని 2020 నవంబర్‌లోనే ఆవిష్కరించగా.. నాటి నుంచి ఫిబ్రవరి 2022 వరకు సముద్రంలో ఆయుధాలు, సోనార్లు సహా వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. గతంలో భారత్‌లో నిర్మించిన సబ్‌మెరైన్లు అన్నింటిలో వగీర్‌(INS Vagir)నే అత్యంత వేగంగా నిర్మించారు. భారత్‌లో మెరుగుపడుతున్న ఆత్మనిర్భర్‌కు ఇది ఉదాహరణగా నిలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని