
కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం కుదరదు
సుప్రీం కోర్టుకు నివేదించిన కేంద్ర ప్రభుత్వం
దిల్లీ: కరోనా వైరస్‌తో మరణించిన బాధిత కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున పరిహారం ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలా ఇవ్వాల్సి వస్తే విపత్తు సహాయ నిధులు మొత్తం వాటికే కేటాయించాల్సి వస్తుందని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. కొవిడ్ మృతుల కుటుంబాలకు విపత్తు సహాయం కింద పరిహారం ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలిపింది.
‘దేశవ్యాప్తంగా దాదాపు 4లక్షల మంది కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో కరోనా బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సి వస్తే ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధులన్నీ వాటికే ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒకవేళ అలా చేస్తే కరోనా వైరస్ విజృంభణ సమయంలో అత్యవసర వైద్య సేవలు, పరికరాలను సమకూర్చుకోవడం, లేదా తుపానులు, వరదలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట్రాల వద్ద సరిపడా నిధులు ఉండవు’ అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అందుకే కొవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని పిటిషనర్ చేసిన విన్నపం రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్థోమతకు మించినదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాకుండా ఒకవేళ కరోనాకు పరిహారం చెల్లిస్తే, ఇతర వ్యాధులకు నిరాకరించడం అన్యాయమే అవుతుందని అభిప్రాయపడింది. కేవలం వరదలు, భూకంపాల వంటి ప్రకృతి వైపరిత్యాలకు మాత్రమే విపత్తు సహాయం వర్తిస్తుందని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.
ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా వైరస్ ఉద్ధృతి కాస్త అదుపులోకి వచ్చినప్పటికీ కరోనా మరణాల సంఖ్య కొనసాగుతూనే ఉంది. నిత్యం 1500లకు పైగా కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారిసంఖ్య 3లక్షల 86వేలు దాటింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.