Cancer: 50 ఏళ్లలోపు వారిలో 79% పెరిగిన క్యాన్సర్‌ కొత్త కేసులు!

Cancer: క్యాన్సర్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు ఓ అధ్యయనం తెలిపింది. 1990 తర్వాత కేసులు ఎలా పెరిగాయి, ఏయే క్యాన్సర్లు అధికమవుతున్నాయో వివరించింది.

Updated : 06 Sep 2023 14:23 IST

దిల్లీ: క్యాన్సర్‌ (Cancer) కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా ఓ అధ్యయనం దీనిపై ఆందోళనకర విషయాలను వెల్లడించింది. 50 ఏళ్లలోపు వారిలో కొత్తగా క్యాన్సర్‌ (Cancer) బారిన పడిన వారి సంఖ్య 79 శాతం పెరిగిందని ప్రముఖ జర్నల్‌ బీఎంజే ఆంకాలజీ తెలిపింది. గత 30 ఏళ్లకు సంబంధించిన వివరాలను ఇది వెల్లడించింది. స్కాట్‌లాండ్‌లోని ఎడిన్‌బర్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని జరిపారు.

శ్వాసనాళం, ప్రోస్ట్రేట్‌ క్యాన్సర్‌ కేసులు వేగంగా పెరిగాయని పరిశోధనలో తేలినట్లు జర్నల్‌ పేర్కొంది. రొమ్ము, శ్వాసనాళం, ఊపిరితిత్తులు, పేగు, ఉదర క్యాన్సర్ల వల్ల మరణాలు అధికంగా సంభవిస్తున్నట్లు తెలిపింది. 1990 నుంచి శ్వాసనాళం, ప్రోస్ట్రేట్‌ క్యాన్సర్‌ కేసులు వేగంగా పెరుగుతూ వస్తున్నట్లు పేర్కొంది. తక్కువ వయసులోనే గుర్తించిన క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్‌ కేసులు 2019లో అత్యధికంగా నమోదైనట్లు వెల్లడించింది. తక్కువ వయసులో క్యాన్సర్‌ వచ్చే సంభావ్యత 2030లో 31 శాతానికి పెరుగుతుందని అధ్యయనం పేర్కొంది. అలాగే సంబంధిత మరణాల సంఖ్య సైతం 21 శాతం పెరుగుతాయని అంచనా వేసింది. 40లలో ఉన్న వారికి ముప్పు అధికంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. అయితే, కొత్త కాలేయ క్యాన్సర్‌ కేసుల నమోదు మాత్రం ఏటా దాదాపు 2.88 శాతం తగ్గిందని పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా 50 ఏళ్లలోపు వారిలో క్యాన్సర్‌ వల్ల 2019లో పది లక్షల మందికి పైగా మరణించారని అధ్యయనం పేర్కొంది. 1990తో పోలిస్తే ఈ సంఖ్య 28 శాతం పెరిగినట్లు వెల్లడించింది. రొమ్ము క్యాన్సర్‌ తర్వాత అత్యధిక మంది శ్వాసనాళం, ఊపిరితిత్తులు, ఉదరం, పేగు క్యాన్సర్‌తో మరణిస్తున్నట్లు తెలిపింది. కిడ్నీ, అండాశయ క్యాన్సర్‌ వల్ల మరణిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు వెల్లడించింది. క్యాన్సర్‌ బారిన పడడానికి జన్యుపరమైన అంశాలు ఒక కారణమని పేర్కొంది. అలాగే ‘రెడ్‌ మీట్‌’, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం క్యాన్సర్‌ ముప్పును పెంచే కారకాల్లో ఒకటని తెలిపింది. ఆల్కహాల్‌, పొగాకు కూడా క్యాన్సర్‌కు దారితీస్తుందని వివరించింది. శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు, అధిక బిపీ కూడా క్యాన్సర్‌ ముప్పును పెంచుతున్నట్లు వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని