DCGI: 18 ఫార్మా కంపెనీల లైసెన్స్‌లు రద్దు చేసిన కేంద్రం

దేశవ్యాప్తంగా 18 ఫార్మా కంపెనీల లైసెన్స్‌ల(Pharma Companies)ను కేంద్రం రద్దు చేసింది. గత 15 రోజులుగా 20 రాష్ట్రాల్లో పలు ఫార్మా సంస్థల్లో తనిఖీలు నిర్వహించిన డీసీజీఐ(DCGI), నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు చేపట్టింది.

Published : 28 Mar 2023 22:29 IST

 

దిల్లీ: మార్గదర్శకాలను పాటించకుండా నాసిరకం మందులను తయారు చేస్తోన్న 18 ఫార్మా సంస్థల (Pharma Companies) అనుమతులను కేంద్రం రద్దు చేసింది. ఈ మేరకు భారత ఔషధ నియంత్రణ మండలి (DCGI) మంగళవారం ప్రకటించింది. ఏయే సంస్థల లైసెన్స్‌లు రద్దు చేశారనే వివరాలు తెలియాల్సివుంది. గత 15 రోజులుగా 20 రాష్ట్రాల్లో పలు ఫార్మా సంస్థల్లో డీసీజీఐ తనిఖీలు నిర్వహించింది. వీటిలో 18 ఫార్మా కంపెనీలను తక్షణం మందుల తయారీని నిలిపివేయాలని ఆదేశించింది. మిగిలిన కంపెనీలపై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీటిలో హిమాచల్‌ ప్రదేశ్‌లో 70 కంపెనీలు, ఉత్తరాఖండ్‌లో 45, మధ్యప్రదేశ్‌లో 23 కంపెనీలు ఉన్నాయని తెలిపింది. మరోవైపు అనుమతులు లేకుండా ఆన్‌లైన్‌లో మందులు విక్రయిస్తున్న ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.  

గతేడాది గాంబియా, ఉజ్బెకిస్థాన్‌లలో భారత్‌కు చెందిన ఫార్మాకంపెనీలు తయారు చేసిన సిరప్‌లు వాడి పలువురు చిన్నారులు మృత్యువాతపడ్డారు. వీటిపై విచారణ జరిపిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ మందులను నాసిరకమైనవిగా నిర్ధారించింది. గత నెలలో గుజరాత్‌కు చెందిన ఔషధ తయారీ కంపెనీ అమెరికాకు సరఫరా చేసిన 55 వేల సీసాల జనరిక్‌ ఔషధాలను వెనక్కి రప్పించింది. అంతకుముందు అమెరికా వైద్యారోగ్య శాఖ అభ్యంతరాలు తెలపడంతో చైన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మా కంపెనీ కంటి మందు తయారీని నిలిపివేసింది. ఈ వరుస ఘటనల నేపథ్యంలో కేంద్ర వైద్యారోగ్యశాఖ ఆదేశాలతో డీసీజీఐ బృందాలు పలు రాష్ట్రాల్లోని ఫార్మా సంస్థల్లో తనిఖీలు నిర్వహించాయి. ఆయా సంస్థలు ఉత్పత్తి చేస్తోన్న ఔషధాలను కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (CSDSCO) పరీక్షించి రూపొందించిన నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టినట్లు సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని