Vaccines: వైద్యుల అనుమతి లేకుండా వారు పారాసెటమాల్ తీసుకోవద్దు!

దేశంలో ప్రస్తుతం 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్కులకు కరోనా టీకా అందిస్తున్నారు. ఆ పిల్లలు ఎవరు కూడా వైద్యులను సంప్రదించకుండా  పారాసెటమాల్ మాత్రను తీసుకోకూడదని నిపుణులు హెచ్చరించారు. కొన్ని టీకా కేంద్రాలు 500 ఎంజీ పారాసెటమాల్ మాత్ర తీసుకోవాలని సూచిస్తున్నాయంటూ వస్తోన్న ఆందోళన మధ్య నిపుణుల స్పందన వెలువడింది.

Published : 07 Jan 2022 18:35 IST

దిల్లీ: దేశంలో ప్రస్తుతం 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్కులకు కరోనా టీకా అందిస్తున్నారు. ఆ పిల్లలు ఎవరూ వైద్యులను సంప్రదించకుండా పారాసెటమాల్ మాత్రను తీసుకోకూడదని నిపుణులు హెచ్చరించారు. కొన్ని టీకా కేంద్రాలు 500 ఎంజీ పారాసెటమాల్ మాత్ర తీసుకోవాలని సూచిస్తున్నాయంటూ వస్తోన్న ఆందోళన మధ్య నిపుణుల స్పందన వెలువడింది.

‘టీకా రోగనిరోధక శక్తి ఎలా మారుతుందో తెలియదు కాబట్టి.. టీకా తీసుకోవడానికి ముందు లేక తర్వాత పారాసెటమాల్ తీసుకునేందుకు ఎటువంటి సిఫారసు చేయలేదు. టీకా తీసుకున్న తర్వాత రెండు రోజులు జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, బద్ధకం వంటికి సాధారణమే. అవి తర్వాత వాటంతట అవే తగ్గుతాయి. అయితే జ్వరం ఎక్కువైతే వైద్యులను సంప్రదించిన తర్వాతే మాత్ర తీసుకోవాలి. పిల్లలు పారాసెటమాల్ తీసుకోవడం వల్ల అది వారిలో హెపటోటాక్సిసిటీ (మాత్ర తీసుకోవడం వల్ల కాలేయానికి హాని కలిగే పరిస్థితి)ని కలిగించే అవకాశం ఉంది. టీకా తీసుకున్న పిల్లలకు జ్వరం వస్తే మెఫెనామిక్ యాసిడ్, మెఫ్తల్ సిరప్ ఇవ్వాలి. 18 ఏళ్లు పైబడిన వారు పారాసెటమాల్ తీసుకోవడం సురక్షితం’ అని వైద్య నిపుణులు వెల్లడించారు. 

దేశంలో ఒమిక్రాన్ రూపంలో కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో.. 15 నుంచి 18 ఏళ్ల వయస్సు వారికి కొవాగ్జిన్ టీకా అందిస్తున్నారు. పిల్లలకు కొవాగ్జిన్‌ టీకా ఇచ్చాక పారాసెటమాల్‌ ట్యాబ్లెట్లు కానీ, నొప్పి నివారణ మాత్రలు గానీ వేసుకోవాలని తాము సిఫారసు చేయలేదని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ పేర్కొంది. టీకా తీసుకున్న పిల్లలకు పారాసెటమాల్‌ - 500 ఎంజీ ట్యాబ్లెట్లు 3 వేసుకోవాలని సూచిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలా చేయాలని తాము చెప్పలేదని భారత్‌ బయోటెక్‌ ట్విటర్‌లో పేర్కొంది. క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా కొవాగ్జిన్‌ టీకాను 30,000 మందిపై పరీక్షించగా, 10- 20 శాతం మందిలోనే కొన్ని ‘సైడ్‌ ఎఫెక్ట్స్‌’ కనిపించాయని, అవి కూడా ఎంతో చిన్నవని వివరించింది. రెండు మూడు రోజుల్లోనే అవి సర్దుకున్నాయని, అందుకు ప్రత్యేకంగా చికిత్స తీసుకోవాల్సిన అవసరం లేదనీ స్పష్టం చేసింది. పారాసెటమాల్‌ ట్యాబ్లెట్లను ఇతర సంస్థల కరోనా టీకాలకు సిఫారసు చేస్తున్నారని, ‘కొవాగ్జిన్‌’కు అవసరం లేదని పేర్కొంది. ఒకవేళ ఏమైనా ఇబ్బంది అనిపిస్తే వైద్యుల సిఫారసు మేరకే ఔషధాలు వాడాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని