Wang Yi: చైనా విదేశాంగ మంత్రి భారత్‌కు రానున్నారా..?

చైనా విదేశాంగమంత్రి వాంగ్‌ యీ ఈ నెలాఖరులో భారత్‌లో పర్యటించనునట్లు తెలుస్తోంది. మొదట నేపాల్ వెళ్లి, తర్వాత భారత్‌కు రానున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Updated : 16 Mar 2022 14:45 IST

గల్వాన్‌ ఘటన తర్వాత రానున్న సీనియర్ స్థాయి చైనా నేత

దిల్లీ: చైనా విదేశాంగమంత్రి వాంగ్‌ యీ ఈ నెలాఖరులో భారత్‌లో పర్యటించనునట్లు తెలుస్తోంది. మొదట నేపాల్ వెళ్లి, తర్వాత భారత్‌కు రానున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆ వార్తలు గనుక వాస్తవరూపం దాల్చితే.. గల్వాన్‌ ఘటన తర్వాత సీనియర్ స్థాయి చైనా నేత మనదేశంలో పర్యటించడం ఇదే తొలిసారి కానుంది. కాగా, ఈ పర్యటనపై ఎలాంటి ధ్రువీకరణ వెలువడలేదు.  

వాస్తవాధీన రేఖ వెంబడి లద్దాఖ్ సరిహద్దు వద్ద గల్వాన్ లోయలో 2020లో భారత్‌-చైనా మధ్య తీవ్ర ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. చైనా వైపు కూడా చాలామందే మరణించారని పలు కథనాలు వెల్లడించాయి. కానీ ఆ దేశం మాత్రం ఇంతవరకూ మృతుల సంఖ్యను వెల్లడించలేదు. ఆ ఘటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. డ్రాగన్‌ దేశంపై మన దగ్గర తీవ్ర నిరసన వ్యక్తం అయింది. అయితే సరిహద్దు వెంబడి ఉద్రికత్తలను తగ్గించుకునేందుకు ఇరు వర్గాల మధ్య సైనిక స్థాయి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సమయంలో పర్యటనపై వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. భారత్-చైనా సంబంధాల గురించి ఎదురైన ప్రశ్నపై ఆ మధ్య వాంగ్‌ యీ స్పందించారు. ‘ఇటీవల కాలంలో ఇరు దేశాలకు ద్వైపాక్షికంగా కొన్ని ఎదురుదెబ్బలు ఎదురయ్యాయి’ అన్నారు. సంప్రదింపులు ద్వారా ఈ విభేదాలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. అయితే కొన్ని శక్తులు భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు పెంచడానికి ప్రయత్నిస్తున్నాయని వ్యాఖ్యానించారు. అమెరికాను ఉద్దేశించి ఈ విమర్శ చేశారు. మరోపక్క, సరిహద్దు సమస్యపై భారత్ పూర్తి స్పష్టతతో చైనాతో చర్చలు జరుపుతోందని కొద్దిరోజుల క్రితం విదేశాంగ మంత్రి ఎస్‌ జై శంకర్ అన్నారు. యథాతథ స్థితిని మార్చడానికి లేక వాస్తవాధీన రేఖను ఏకపక్షంగా మార్చే ప్రయత్నాన్ని అంగీకరించబోమని స్పష్టం చేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని