Operation Lotus: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆ ట్రాప్‌లో పడరు: సీఎం సిద్ధరామయ్య

ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా.. ఏ ఒక్క కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కూడా భాజపా ప్రయత్నాలకు లొంగరని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు.

Published : 08 Nov 2023 19:46 IST

బెంగళూరు: తన ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు భాజపా చేస్తోన్న ప్రయత్నాలు విఫలమవుతాయని కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM  సిద్ధరామయ్య మరోసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎంతో బలంగా ఉన్నారన్న ఆయన.. ఆపరేషన్‌ కమలం (Operation Lotus) ట్రాప్‌లో ఎప్పటికీ పడరని ఉద్ఘాటించారు.

‘మా ఎమ్మెల్యేలు బలంగా ఉన్నారు. భాజపా ప్రయత్నాలు విఫలమవుతాయి. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా.. ఏ ఒక్క కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కూడా వారి ప్రయత్నాలకు లొంగరు’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు భాజపా ప్రయత్నాలు చేస్తోందంటూ సీఎం సిద్ధరామయ్యతోపాటు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు కొంతకాలంగా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గతంలో ఆపరేషన్‌ కమలానికి సారథ్యం వహించిన వ్యక్తే ఈసారి కూడా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తున్నారనే వార్తలు వినిపించాయి. ఇదే విషయంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సీఎం సిద్ధరామయ్య ఇలా స్పందించారు.

మరోవైపు కర్ణాటక ప్రభుత్వంలో రెండున్నరేళ్ల తర్వాత అధికార (ముఖ్యమంత్రి) మార్పు ఉంటుందని వచ్చిన వార్తలను సిద్ధరామయ్య ఇటీవల ఖండించారు. అధికార మార్పు ప్రసక్తే లేదని, ఐదేళ్లపాటు తానే ఈ పదవిలో కొనసాగుతానని తేల్చి చెప్పారు. ‘ఆపరేషన్‌ కమలం’ పేరుతో గతంలో ఓసారి విజయం సాధించడంతో మరోసారి అలాగే చేయొచ్చని భాజపా భ్రమపడుతోందన్నారు. కానీ, ఈసారి మాత్రం వారి ప్రయత్నాలు సఫలం కావన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని